‘లక్ష్మణ రేఖ’ దాటిన మమత
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు గుప్పించిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కమలనాథులు మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తీసుకొచ్చిన మార్పు ఏమీ లేదని, ఆమె తీసుకొచ్చినది అరాచకత్వం మాత్రమే అని ఆరోపించారు. ప్రతిరోజూ ఆమె లక్ష్మణ రేఖ దాటి మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ శనివారం తన బ్లాగ్‌లో తప్పుబట్టారు.
పశ్చిమబెంగాల్‌కు 34 ఏళ్ల వామపక్ష పాలన నుంచి విముక్తి కలిగించి మార్పు తీసుకొస్తానని మమత చెప్పారని, అయితే ఇప్పుడామె అరాచకత్వం, బూత్‌ల ఆక్రమణ, బంగ్లా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు వామపక్షాలని, వాటి తర్వాతి స్థానం కాంగ్రెస్ పార్టీదని, అయితే మమత వీరిని విమర్శించరని, బీజేపీని, మోడీని లక్ష్యంగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో వామపక్షాల్లో ఉండే గూండాలు, దొంగలు ప్రస్తుతం తృణమూల్‌లోకి వచ్చారని ఆరోపించారు.