కేసీఆర్‌ది అహంకారం: దాసోజు శ్రవణ్
* టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
* పార్టీ నిర్మాణమే చేయలేనోడు.. తెలంగాణను పునర్నిర్మిస్తాడా?
* సీఎం పదవి కోసం సోనియా కాళ్లు మొక్కారు
* ఇప్పుడేమో ఆమెపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీనే సంస్థాగతంగా నిర్మించుకోలేకపోయిన కేసీఆర్... అధికారంలో కొస్తే తెలంగాణను పునర్నిర్మిస్తానని చెప్పడం పెద్ద జోక్ అని తెలంగాణ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఎన్నికల్లో రాత్రికి రాత్రే టికెట్లు అమ్ముకున్న కేసీఆర్.. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అమ్మకానికి పెడతాడని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో దాసోజు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట తప్పడంలో, అబద్ధాలు ఆడటంలో కేసీఆర్‌ను మించిన వారెవరూ లేరని, ఇప్పటికే వెయ్యి అబద్ధాలాడారని ఆరోపించారు.
సోనియాగాంధీని బలిదేవత అంటున్న కేసీఆర్, కేటీఆర్‌లు.. తెలంగాణ ఇచ్చిన వెంటనే సోనియాను దేవత అంటూ కాళ్లకు దండం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన వెంటనే సోనియాను కొనియాడుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత విమర్శలు చేసిన వీడియో దృశ్యాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తెలంగాణ ప్రజలంతా సోనియాను దేవతలా భావిస్తుంటే.. బలిదేవత అనడం కేసీఆర్ అహంకారానికి, కండకావరానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ నయవంచకుడని, సీఎం పదవి కోసం ఏ గడ్డి అయినా తింటారని విమర్శించారు. సీఎం పదవి కావాలంటూ కుటుంబసభ్యులతో కలసి వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే 25 లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి సోనియాగాంధీని సన్మానిస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
తెలంగాణలో ఆత్మహత్యలకు ప్రధాన కారణం టీఆర్‌ఎస్సేనని విమర్శించారు. సిద్ధిపేటలో కిరోసినో లేక రంగునీళ్లో ఒంటిపై చల్లుకున్న హరీష్‌రావు ఆత్మహత్య చేసుకుంటానని రెచ్చగొట్టడంవల్లే తెలంగాణలో అమాయకులు బలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.