పోటీకి మాజీ చైర్మన్లు దూరం
బల్దియాలో రెండోసారి దక్కని అధికారం
నిర్మల్, న్యూస్‌లైన్ : నిర్మల్ మున్సిపల్ చైర్మన్లుగా ఇప్పటి వరకు పది మంది పదవులు అధిష్టించారు. వీరిలో ఇప్పటివరకు రెండోసారి పదవిని అలంకరించిన వారే లేరు. రిజర్వేషన్లు కలిసిరాక కొందరు, అవకాశం వచ్చినా తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటామో లేదోనని మరికొందరు పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఎవరూ రెండోసారి ఆ పీఠాన్ని అధిరోహించలేకపోయారు. నిర్మల్ పట్టణం మున్సిపాలిటీగా 1952లో ఆవిర్భవించింది.
మొట్టమొదట చైర్మన్‌గా ఎ.రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం జాప పోశెట్టి, జాప రాములు, అప్పాల నర్సయ్య, పూదరి జయదేవ్, ఎ.పద్మనాభరెడ్డి, రావుల ఎల్లయ్య, అయ్యన్నగారి భూలక్ష్మి, గండ్రత్ ఈశ్వర్, అప్పాల అనురాధ చైర్‌పర్సన్‌లుగా పనిచేశారు. 2005వ సంవత్సరం వరకు 28వార్డులు ఉండగా, 2005లో జరిగిన వార్డుల పునర్విభజనలో మరో 8వార్డులు పెరిగాయి. దీంతో వార్డుల సంఖ్య 36కు చేరింది.
ఆసక్తి చూపని మాజీలు
మున్సిపల్ చరిత్రలో చైర్మన్ పదవిని అలంకరించిన వారు తిరిగి ఆ స్థానంలో రెండోసారి ఏ ఒక్కరూ ఇప్పటివరకు కూర్చోలేదు. ఒక్కోసారి రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడం, వచ్చినా ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటి వరకు ఎవరూ రెండోసారి పోటీలో నిలబడలేదు. 1995-2000 కాలంలో చైర్‌పర్సన్‌గా పనిచేసిన అయ్యన్నగారి భూలక్ష్మి 2005లో జరిగిన ఎన్నికల్లో వార్డు కౌన్సిలరుగా పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈమె ఒక్కరు మినహా చైర్‌పర్సన్‌గా పనిచేసిన వారిలో మరెవ్వరూ తిరిగి పోటీకి ఆసక్తి చూపలేదు.
చైర్మన్ స్థానంపై పార్టీల గురి
అన్ని పార్టీలు జిల్లాలోని నిర్మల్ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటాయి. 1995-2000లో బీజేపీ, 2000-05లో టీడీపీ, 2005-10లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ యేడాది జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ స్థానం మహిళకు రిజర్వ్ కాగా, ఒక్క నిర్మల్ మున్సిపాలిటీ మాత్రం జనరల్‌కు కేటాయించారు. దీంతో అందరూ ఆస్థానంపై దృష్టి సారించారు. దీంతో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత ఎన్నికల్లో వార్డులకు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి.
36 వార్డులకు 332 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. కొందరు రెండు, మూడు సెట్‌లు వేసిన వారు కూడా ఉన్నారు. ఉప సంహరణ గడువు మంగళవారం ముగియగా.. 210 మంది మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్నారు. చైర్‌పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్‌పర్సన్ స్థానం ఎవరిని వరిస్తుందో ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే.
ఒకే రోజు రెండు ఉద్యోగ అర్హత పరీక్షలు
మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతో హిందుష్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటించిన రెండు ఉద్యోగ అర్హత పరీక్షలు ఈ నెల 23న ఉన్నాయి. ఒకే రోజు రెండు పరీక్షలకు ఎలా హాజరయ్యేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒకటి కోల్పోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్‌తోపాటు పరీక్ష తేదీని సైతం అదే రోజు ప్రకటించింది.
హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ గత ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువరించి పరీక్ష తేదీని ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలు అయినప్పటికీ నిరుద్యోగుల నుంచి ఫీజు వసూలు చేశాయి. రెండు ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిగ్రీలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ కోర్సు చదివిన వారు అర్హులు. ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలు కావడంతో ఏదో ఒక సంస్థలో ఉద్యోగం వస్తుందకున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.