ఎన్నికల వేళ అభ్యర్థులు దారుణాతిదారుణాలన్నింటినీ రెండు రోజుల్లో చూపిస్తారు.
గుంటూరు: ఎన్నికల వేళ అభ్యర్థులు దారుణాతిదారుణాలన్నింటినీ రెండు రోజుల్లో చూపిస్తారు. నమ్మలేనివిధంగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నికలలో గెలవడం కోసం డబ్బు - కులం - మద్యం - మతం - ప్రాదేయపడటం - బెదిరింపు...ఇలా ఏది వీలైతే అది, దేని ద్వారా పని అవుతుందనుకుంటే దానిని అనుసరిస్తుంటారు. చిత్రవిచిత్రాలు అన్ని చూపిస్తారు. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తారు. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు ప్రకటించినా పట్టించుకునేవారులేరు. ఆ నిబందనలు అన్నింటినీ తుంగలోతొక్కి వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు.
సాదారణంగా అభ్యర్థులు తమకు ఓటు వేయమని డబ్బులు ఇస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాత్రం అసలు ఓటు వేయవద్దని డబ్బులు పంచుతున్నారు. బిజెపి అంటే ముస్లీంలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఓటు వేస్తే బిజెపియేతర పార్టీకి ఓటు వేస్తారు. అందువల్ల వారిని ఓటింగ్కు రావద్దని డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. సాలెంనగర్, ఇస్లాంపేటలలో విచ్చలవిడిగా డబ్బుపంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.