ఈసీ కళ్లు మూసి...
- అసెంబ్లీకి రూ.10 కోట్లు..
- పార్లమెంటుకు రూ.30 కోట్ల ఖర్చు
- రాష్ట్రంలో సగటున ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చిది!
- ఎన్నికల ఖర్చు అధికంగా చేసేది మన రాష్ట్రమే
అభ్యర్థి ఎన్నికల ఖర్చును ప్రధానంగా మూడు భాగాలుగా చూడవచ్చు
1
ప్రచార పటాటోపం, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణ ఖర్చులు ఒక భాగం. అభ్యర్థి మొత్తం ఎన్నికల ఖర్చులో ఇది 15 శాతం దాకా ఉండవచ్చు. ఈ ఖర్చులో ఈసీకి చూపేది కొంత మాత్రమే.
2
గ్రామాల్లో వివిధ వర్గాల మూకుమ్మడి మద్దతు కూడగట్టేందుకు గుడి, చర్చి, మసీదు, కళ్యాణమండపం వంటి నిర్మాణాలు చేపట్టడం, లేదా అందుకవసరమైన డబ్బును గ్రామ పెద్దల వద్ద డిపాజిట్ చేయడం, గ్రామంలో బోర్లు వేయించడం, రోడ్లు నిర్మించడం వం టివాటికి తోడు గ్రామ స్థాయి నేతల అలకలు తీర్చడం వంటివాటికి చేసే ఖర్చు రెండో రకం. మొత్తం ఎన్నిల ఖర్చులో ఇది ఏకంగా 35శాతం దాకా ఉండవచ్చు. కానీ ఇది ఈసీ లెక్కల్లోకి అసలే రాదు!
3
ఇక ప్రధానమైన ఖర్చు పోలింగ్ రోజుకు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ! మొత్తం ఖర్చులో 50 శాతం దాకా ఉంటుంది. గత ఎన్నికల్లో కొన్నిచోట్ల ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 దాకా పంచిన దాఖలాలున్నాయి. ఈసారీ అదే పరిస్థితి ఉండొచ్చని పలు పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. పార్టీలకు, నేతలకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న పెట్టుబడిదారీ, వ్యాపార వర్గాల ప్రతినిధులు ఇప్పుడు నేరుగా రాజకీయ రంగప్రవేశం చేస్తుండటం వల్లే ఎన్నికల వ్యయం భారీ గా పెరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎలక్షన్ సెల్
ఘుమఘుమలాడే, నోరూరుంచే బిర్యానీ కేవలం రెండు రూపాయలే. రుచికరమైన శాకాహార భోజనమైతే రూపాయే! ఇక గరం గరం చాయ్ కేవలం పావలా!! ‘ఎక్కడ? ఆ భూతల స్వర్గం ఎక్కడ?’ అంటున్నారా? ఆగండాగండి. ప్రచార వ్యయం విషయంలో ఎన్నికల సంఘం కళ్లు గప్పేందుకు అభ్యర్థులు చూపించే కాకి లెక్కలివి. ఇలాంటి విచిత్ర విన్యాసాలెన్నో గత ఎన్నికల్లో వెలుగు చూశాయి.
ఆ దృష్ట్యా ఎన్నికల్లో ఖర్చును నియంత్రించేందుకు ఈసీ ఎన్ని కొత్త నిబంధనలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా అభ్యర్థులు కూడా అంతగా తెలివి మీరుతున్నారు. ఈసీ కళ్లుగప్పి ఈసారి కూడా కోట్లు గుమ్మరించేస్తున్నారు. ఈ విషయంలో దేశం మొత్తంలోనూ ఆంధ్రప్రదేశే ముందుంది!
ఆంధ్రప్రదేశ్‌ను డబ్బు ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రంగా ఈసీ గుర్తించినా, ఆ మేరకు ప్రత్యేకంగా పలు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. తనిఖీల్లో ఇప్పటికే వందలాది కోట్లు పట్టుబడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అభ్యర్థులు ఈసీని కాకి లెక్కలతో ఏమారుస్తూ ఎడాపెడా ఖర్చుపెట్టేస్తున్నారు...
ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల కోసం లోక్‌సభ అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షల కన్నా ఎక్కువగా ఖర్చు చేయకూడదు. అంతకు మించితే సదరు అభ్యర్థుల ఎన్నిక చెల్లదని ఈసీ హెచ్చరిస్తోంది. అనధికార అంచనాల మేరకు మన రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.10 కోట్లు, లోక్‌సభకైతే రూ.30 కోట్లు ఉంటోంది. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లోనైతే ఇది మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా.
గత ఎన్నికల్లో అధికారుల రొటీన్ తనిఖీల్లోనే ఏకంగా రూ.38 కోట్లు పట్టుబడ్డాయి. ఎన్నికల్లో పెరిగిపోతున్న డబ్బు ప్రాధాన్యతపై ఓ సీనియర్ నాయకుడు నిర్వేదం వెలిబుచ్చారు. ‘మాది ఒక రకంగా పులి మీద స్వారి వంటి వ్యవహారం. ఎవరూ ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాలని అనుకోడు. కానీ ఒకసారి బరిలో దిగాక అవతలి వాడు ఓటుకు వందిస్తే ఇవతలి వాడూ ఇవ్వక తప్పని పరిస్థితి’ అంటూ ముక్తాయించారు.