ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల వారు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. తమ ప్రాంతాలను ఆంధ్రలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వేలేరుపాడు మండల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జెడ్పీటీసి అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకుని ఎన్నికలను బహిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఆవరణలో నామినేషన్ ఉపసంహరణ జిరాక్స్ పత్రాలను చించివేసి నిరసన తెలిపారు.
‘ఆంధ్ర వద్దు -తెలంగాణ ముద్దు’ అనే నినాదాలు చేస్తూ, ఆందోళన చేపట్టారు. జిల్లాలోని ఆరు మండలాలు పూర్తిగా, మరో మండలంలో ఎక్కువ భాగం పోలవరం ముంపు కింద ప్రకటించడంతో కుక్కునూరు మండలానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు అఖిల పక్షంగా ఏర్పడి జెడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయకుండానే బహిష్కరించారు. తాజాగా వేలేరుపాడు అఖిలపక్ష నాయకులు సైతం ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో ఆయా పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఎనిమిది మంది అభ్యర్థుల చేత వాటిని ఉపసంహరింపజేశారు. దీంతో ఈ రెండు మండలాలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఇప్పటికే అధికారులు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం వివరించారు.
సార్వత్రిక ఎన్నికలనూ తిరస్కరిస్తాం...
ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను విరమించుకోవాలని, లేకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. సార్వతిక ఎన్నికల్లో తమ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి పోటీలో ఉన్నా వారికి ఓట్లు వేయకుండా, నోటా విధానం ద్వారా ఓటును తిరస్కరిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ముంపు ప్రాంతాలైన పోలవరం, చింతూరు, వీఆర్ పురం, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు, భద్రాచలంలో ఎన్నికలను అడ్డుకుంటామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ జిల్లా కార్యద ర్శి భాగం హేమంతరావు, న్యూడెమోక్రసీ నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, రామయ్య, వెంకటేశ్వర్లు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మయ్య, గౌస్, వెంక న్నబాబు తదితరులు పాల్గొన్నారు.
నామినషన్లు ఉపసంహరించుకున్న వారి జాబితా ఇలా ఉంది..
కాలనేని శివకుమారి (వైఎస్‌ఆర్ సీపీ), కేశగాని వెంకటేశ్వరమ్మ (వైఎస్‌ఆర్ సీపీ), కారం రమాదేవి (సీపీఐ), కుంజా స్వాతి (న్యూడెమోక్రసీ), బనిగండ్ల లక్ష్మి (టీడీపీ), వలపర్ల శిరీష (కాంగ్రెస్), పసుపులేటి పుష్పావతి (కాంగ్రెస్), మామిండ్లపల్లి శ్యామల (ఇండిపెండెంట్).
‘ముంపు’ ఆగ్రహం...
Published Tue, Mar 25 2014 3:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement