సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనే అధికారులకు గౌరవ వేతనాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. జోనల్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ అధికారులు, సబార్డినేట్ సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు రోజున భోజనం, రిఫ్రెష్‌మెంట్స్‌కు సంబంధించి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోనల్ ఆఫీసర్/రూట్ ఆఫీసర్/సెక్టోరల్ ఆఫీసర్‌కు ఒకేసారి గౌరవ వేతనం రూ.1,500లు, కింది సిబ్బందికి రోజువారీ లెక్కన గౌరవ వేతనం ఇస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్/కౌంటింగ్ సూపర్‌వైజర్‌కు రూ.350, పోలింగ్ ఆఫీసర్/కౌంటింగ్ అసిస్టెంట్‌కు రూ.250లు, ఆఫీస్ సబార్డినేట్(కాస్ల్-4)కు రూ.150లు, పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి భోజనం లేదా రిఫ్రెష్‌మెంట్స్‌కు రూ.150లు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వేతనాలు ఎన్నికలు జరిగే 146 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లకు వర్తిస్తుంది.