జిల్లా అంతా ఫ్యాన్....
- విజయమ్మ రెండు రోజుల పర్యటనతో ఉత్సాహం
- 12 నియోజక వర్గాల్లో పర్యటన విజయవంతం
- ప్రసంగాలకు ముగ్ధులైన జిల్లావాసులు
- కష్టాలు తీరుస్తారని అన్ని వర్గాల్లో నమ్మకం
- వైఎస్సార్‌సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి వెంటే జనం
- ఫ్యాన్ గాలి జోరుకు ప్రత్యర్థులు బెంబేలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోంది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి విజయమ్మ ప్రచారం రెండు దశల్లో హోరెత్తడంతో ప్రత్యర్థి శిబిరాలు డీలా పడుతున్నాయి. విజయమ్మ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరికీ ధైర్యం చెబుతూ ప్రచారంలో తనదైన శైలి కొనసాగించడం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి జిల్లాలో విజయమ్మ రెండు విడతల్లో ఇప్పటివరకూ 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయవంతంగా పర్యటించారు.
నామినేషన్ వేసిన మరుసటిరోజు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, భీమిలి, గాజువాక, ఎస్.కోట నియోజక వర్గాలను చుట్టేశారు. ప్రతిచోటా రోడ్‌షో నిర్వహించి శ్రేణులను ఉత్తేజపరిచారు. జనం బాగా స్పందించారు. మహానేత సతీమణి స్వయంగా ఇక్కడి నుంచి పోటీచేస్తుండడంతో జనాదరణ పోటెత్తింది. విజయమ్మ ప్రచారం ఫలితంగా జిల్లాలో అన్ని స్థానాల్లో ఫ్యాన్ గాలి రెట్టింపైంది.
విజయమ్మ ప్రతి చోటా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తుండడంతో ప్రజలు ఆమెను గుండెల్లో పెట్టుకుంటున్నారు. జగన్ వస్తే తమ కష్టాలకు ముగింపు దొరుకుతుందని భావిస్తున్నారు. దీంతో తమ కష్టాలు కడతేర్చే జననేత తరపున విజయమ్మ రావడంతో ప్రతి ఒక్కరు ఆమెతో తమ బాధలు పంచుకుంటున్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి వారికిచ్చే ఎక్స్‌గ్రేషియా, బియ్యం, డీజిల్ సబ్సిడీ పెంచుతామని చెప్పినప్పుడు మత్స్యకార వర్గాలు తమను ఆదుకునే దేవత వచ్చిందని సంబరపడ్డారు.
గాజువాక, ఎస్.కోట, విశాఖలోని నాలుగు నగర నియోజక వర్గాల్లో స్థానికంగా పరిశ్రమలను ప్రోత్సహించి ఉన్న పరిశ్రమల విస్తరణ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన చేస్తామని భరోసా ఇవ్వడంతో యువతరం స్పందిస్తున్నారు. శనివారం, ఆదివారం జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పాడేరు, అరకు నియోజక వర్గాల్లో మలివిడత కింద ప్రచారం నిర్వహించారు.
పాడేరు, అరకులో గిరిజనుల సమస్యలను గుర్తించి అక్కడ యువతకు స్థానిక పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఉద్యోగాలు, కొండకుమ్మర్లకు రిజర్వేషన్ సౌకర్యం, గిరిజనులు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. యలమంచిలిలో అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ ద్వారా తలెత్తే సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో అక్కడ వేలాదిమంది విజయమ్మకు నీరాజనాలు పలికారు. రెండు విడతలుగా సాగిన విజయమ్మ ప్రచారంతో గ్రామీణ, నగర విశాఖలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.