ప్రజల పక్షాన పోరాడుతాం
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పును తమ పార్టీ గౌరవిస్తోందని, ప్రతిపక్ష పార్టీగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఆయన శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వీచిన బీజేపీ, మోడీ గాలి వల్లే రాష్ట్రంలో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయని వివరించారు.
ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్దానాలు అమలుకు సాధ్యం కావని, అయినప్పటికీ ప్రజలను నమ్మించారని విమర్శించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారన్నారు.
గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైలుపై చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబుకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఆయన తొలి సంతకం కూడా ఉచిత విద్యుత్‌పైనే చేయాలని డిమాండ్ చేశారు. వెయ్యి రూపాయలకు పింఛన్ల పెంపు, రైతు రుణమాఫీ, డ్వాక్రారుణాల రద్దు, రైతులకు పగటిపూట వ్యవసాయవిద్యుత్, నిరుద్యోగులకు ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేసి నిజాయితీని చాటుకోవాలని సూచించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ధనప్రభావంతో గెలిచిందని, ఓట్ల లెక్కింపులో ఆధిక్యత వచ్చిన వెంటనే అనేక గ్రామాలలో ఆ పార్టీ దౌర్జన్యానికి దిగిందని విమర్శించారు.
ఓటర్లకు కృతజ్ఞతలు
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటువేసిన ప్రజలు, పార్టీ కోసం కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జిల్లా అధికారప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ మదార్‌సాహెబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, మండల కన్వీనర్ మాతంగి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్, కొలగాని వెంకయ్య, పొన్నా రామ్మోహన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకావీరాంజనేయలు, జె.ఉదయభాస్కర్, జగదీష్, పట్టణ యూత్ కన్వీనర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.