అకటా.. పూలకు కటకట!
ఎన్నికల సీజన్‌లో అన్నిటితో పాటు పూలకూ డిమాండ్ విపరీతంగా పెరిగింది. పూలు, పూల దండలు, బొకేల ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్లోకి వస్తున్న పూలన్నీ ఎన్నికల ప్రచారం కోసం అమ్ముడవుతుండగా.. గుళ్లల్లో, దర్గాల్లో పూజలకు, ప్రార్థనలకు అవసరమైన పూలు, పూల దండలు లభించక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గురువారాల్లో దర్గాల్లో, సాయిబాబా దేవాలయాల్లో పుష్పాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలకు ప్రసిద్ధి గాంచిన వారణాసి తదితర పట్టణాల్లో ప్రస్తుతం పూలకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మామూలు రోజుల్లో రూ. 5 ధర పలికే పూలు ప్రస్తుతం రూ. 50 పెట్టినా దొరకడం లేదు. వారణాసిలో బీజేపీ అభ్యర్ధిగా నరేంద్రమోడీ బరిలో ఉండటంతో అక్కడ పుష్పాలు హాట్ కేకులుగా మారాయి. ఎన్నికల ప్రచారంలో గులాబీ పూలకు, గులాబీ రేకులకు డిమాండ్ బాగా ఉందని పూల వ్యాపారస్తులు చెబుతున్నారు. యూపీలో గులాబీ రేకుల ధర కిలో రూ.200లకు చేరింది. అరేబియన్ జాస్మిన్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. కాస్త చౌకగా బంతిపూలు మాత్రమే లభిస్తున్నాయి.