
కాంట్రాక్టర్ల కోసమే ఫ్లై ఓవర్లు
కాంట్రాక్టర్ల కోసమే తలపెట్టినట్లుగా ఎలాంటి ప్రణాళిక, ముందుచూపు లేకుండా కట్టించిన ఫ్లైఓవర్లు ప్రస్తుతం అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలోని 16 ఫ్లైఓవర్లలో ఎనిమిది బాబు జమానాకు సంబంధించినవే. వీటివల్ల ట్రాఫిక్ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రకాష్‌నగర్ ‘టి’ జంక్షన్ ఫై ్లఓవర్‌ను బేగంపేట వరకు మరో 500 మీటర్లు పొడిగిస్తే అత్యంత రద్దీ చౌరస్తాల్లో ఒకటైన రసూల్‌పుర మీదుగా ప్రయాణించే వారికి కొంత ఊరట లభించేది. కానీ అలా చేయకపోవడం వల్ల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. బేగంపేట-సంగీత్ థియేటర్ చౌరస్తాల మధ్య నిర్మించిన చీఫ్ టెలికామ్ ఆఫీసర్ (సీటీఓ) ఫై ్లఓవర్,మాసబ్‌ట్యాంక్, నారాయణగూడ ఫ్లై ఓవర్లు కూడా ఇదే కోవలోకి వస్తాయి.
ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో తెలియక ఏడేళ్ల పాటు దానిని గాలి లోనే ఉంచారు. మరోవైపు ఫ్లైఓవర్‌లను ఇరుగ్గా నిర్మించి ట్రాఫిక్ కష్టాలను రెట్టింపు చేశారు. నిజానికి వీటిని ఆరు లేన్లగా తీర్చిదిద్దాల్సి ఉండాల్సిందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ఇరుగ్గా అగ్గిపెట్టెల్లా నిర్మించారనే ఆరోపణలున్నాయి. వీటి నిర్వహణలో అశ్రద్ధ కారణంగా పదేళ్లకే బీటలు వారుతున్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు పగళ్లు ఏర్పడటం నాణ్యతా లోపమే కారణమని ఇంజనీర్లు చెబుతున్నారు.