బీజేపీ కోసండాకూ మల్ఖాన్ సింగ్ ప్రచారం
డాకూ మల్ఖాన్ సింగ్... ఒకప్పుడు ఈ పేరు వింటేనే చంబల్ లోయ వణికిపోయేది. ఆరడుగులకు మించిన ఎత్తు, మెలితిరిగిన గుబురు మీసాలతో అతడు ఎదురుపడితే, జనం కకావికలమై పరుగులు తీసేవారు. అదంతా చంబల్ లోయలో బందిపోట్ల ప్రాబల్యం కొనసాగినప్పుటి మాట. తర్వాతి కాలంలో చాలామంది బందిపోట్ల మాదిరిగానే మల్ఖాన్ సింగ్ కూడా లొంగు‘బాట’ పట్టాడు. మధ్యప్రదేశ్‌లోని అప్పటి అర్జున్ సింగ్ ప్రభుత్వం డాకూ మల్ఖాన్ సింగ్‌కు, అతడి అనుచరులకు భూదాన్ భూములు ఇచ్చి పునరావాసం కల్పించింది. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలపై దృష్టి సారించిన మల్ఖాన్ సింగ్, ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం సాగిస్తున్నాడు.
కాంగ్రెస్ హయాంలో సామాజిక అసమానతలకు వ్యతిరేకంతా తామంతా తిరుగుబాటుదారులుగా మారామని చెప్పుకుంటున్న మల్ఖాన్ సింగ్, బీజేపీకి ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నాడు. దేశానికి నరేంద్ర మోడీ వంటి నాయకుడు అవసరమని, సుపరిపాలన కోసం బీజేపీని గెలిపించాలని చెబుతున్నాడు. గ్వాలియర్ బీజేపీ అభ్యర్థి నరేంద్రసింగ్ తోమర్, భిండ్ బీజేపీ అభ్యర్థి భగీరథ్ ప్రసాద్‌లతో కలసి మల్ఖాన్ సింగ్ విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొంటున్నాడు.