డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తలెత్తిన విభేదాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తలెత్తిన విభేదాలు ఆ పార్టీ ఆఫీసు తాళం పగలగొట్టే వరకూ వెళ్లాయి. ఒకరికి ఒకటే పదవి అనే ఏఐసీసీ నిబంధన మేరకు క్యామ మల్లేశ్‌ను డీసీసీ పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ సూచించింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు జిల్లా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించిన క్రమంలో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో దిగిన మల్లేశ్‌కు కూడా వైదొలగడం అనివార్యమైంది.
క్యామ స్థానంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ పడాల వెంకటస్వామిని నియమిస్తూ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం బాధ్యతలు స్వీకరించేందుకు గాంధీభవన్ ఆవరణలోని డీసీసీ ఆఫీసుకు వెంకటస్వామి వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడం.. చార్జి ఇచ్చేందుకు క్యామ నిరాకరించినట్లు తెలుసుకున్న వెంకటస్వామి వర్గీయులు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
తాత్కాలికం కావడంతోనే...
ఇదిలావుండగా, ఈ వ్యవహారం కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారితీసింది. జోడు పదవుల నేపథ్యంలో డీసీసీ పదవికి రాజీనామా చేయాలని పీసీసీ సూచించినప్పటికీ, ఆరుగురు డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీచేస్తున్నా.. కేవలం రంగారెడ్డి జిల్లాకే ఈ నిబంధనను వర్తింపజేయడంపై పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా తప్పుబడుతోంది. సోమవారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ దీనిపై వాడివేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పడాల వర్గీయులు గాంధీభవన్ ఆవరణలోనే తాళం పగులగొట్టినా ఎందుకు మిన్నకున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారికి టికెట్లు ఇచ్చారని, వెన్నుపోటు దారులను ప్రోత్సహిస్తున్నవారికి అండగా నిలుస్తున్నారని నిలదీసినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది.
పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించినవారికి పదవులు కట్టబెట్టడం మంచి పద్దతికాదని కేఎల్లార్ అన్నట్లు సమాచారం. అయితే, దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ పొన్నాల, జిల్లా ఇన్‌చార్జి నాగయ్య మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుల్లో దానం మినహా మిగతావారిని తప్పుకోమని ఆదేశించామని, అందులోభాగంగానే వెంకటస్వామిని నియమించినట్లు స్పష్టం చేశారు. అయితే, బాధ్యతలు తీసుకోవడంలో వ్యవహరించిన తీరు సరిగాలేదని అన్నట్లు సమాచారం. మే 16వ తేదీ తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయని, అప్పటివరకు వెంకటస్వామియే జిల్లా సారథిగా ఉంటారని తేల్చిచెప్పినట్లు తెలిసింది.
ఇదిలావుండగా, జిల్లా పరిషత్, పురపాలక సంఘాలను కైవసం చేసుకునేందుకు పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని పొన్నాల సూచించారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ఎంపీపీ అభ్యర్థి ఎంపిక బాధ్యత స్థానిక కాంగ్రెస్ ఇన్‌చార్జులదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, నారాయణరావు, భిక్షపతియాదవ్,పార్టీ అభ్యర్థులు క్యామ మల్లేశ్, బండారి లక్ష్మారెడ్డి, కాలె యాదయ్య, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతను నిర్వర్తిస్తా: పడాల
అధిష్టానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని డీసీసీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి చెప్పారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని, సీనియర్లతో సమన్వయం సాధించడం ద్వారా అత్యధిక పురపాలికలు, జిల్లా, మండల పరిషత్‌లను చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.