ఇప్పటివరకూ గెలవని అభ్యర్థుల పడరాని పాట్లు
హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ పడడమేగాని ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలవని అభ్యర్థులు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రకరకాల విన్యాసాలతో పాటు ‘సెంటిమెంట్’ అస్త్రాన్ని ఓటర్లపై ప్రయోగిస్తున్నారు. ‘‘ఇక్కడ ఇన్ని సార్లు పోటీ చేసినా.. ఓడిపోతూనే ఉన్నా. ఈ సారన్నా కనికరించండి..’’ అని వేడుకుంటున్నారు. వీరికితోడు సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న సీనియర్ నేతలు సైతం తర్వాతి ఎన్నికల్లో పోటీ చేస్తామో లేదోనన్న అనుమానంతో ‘‘నాకు ఇదే ఆఖరి అవకాశం.. గెలిపించి గొప్పగా సాగనంపండి’’ అని విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. వీరంతా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అన్ని పార్టీల నుంచి జరుగుతున్న ఈ తరహా ప్రచారంతో... సరికొత్త ‘సెంటిమెంట్’ వాతావరణం నెలకొంటోంది.
పాలమూరు నిండా ‘సెంటిమెంటే’!..
1. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి ఓటర్లపై సెంట్‌మెంట్ వల విసురుతున్నారు. ‘నాకు పదవులపై ఆశ లేదు. ఇప్పటికే ఎన్నో పదవులు అధిష్టించా. మీ ఆదరాభిమానాలు చూరగొన్నా. ఈ సారి గెలిపించి ఘనం గా వీడ్కోలు అందించండి..’ అంటూ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
2.నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిది చిత్రమైన పరిస్థితి. ఇక్కడ ఆయన నాగం జనార్దన్‌రెడ్డి చేతిలో వరుసగా ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి పోటీలో నాగం లేకపోవడం, వరుస ఓటములను తనకు సానుభూతిగా మలుచుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ‘ఈ సారైనా కనికరించండి..’ అంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.
3. మక్తల్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచిన ఎ.ఎల్లారెడ్డి కురువృద్ధుడు. 70 ఏళ్లకు పైబడిన ఎల్లారెడ్డి ఇకముందు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఇవే తన చివరి ఎన్నికలు అని.. చివరిసారిగా గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
4. టీఆర్‌ఎస్ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న గురునాథరెడ్డి స్థానిక సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేవంత్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. వయస్సుపై బడటంతో రిటైర్‌మెంట్ అస్త్రాన్ని జోడించి ప్రచారం చేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో అదే తంతు...
5. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్న గుండా మల్లేష్‌ది ఇంచుమించు ఇదే పరిస్థితి. 2009 ఎన్నికల్లో మహాకూటమి జట్టులో గెలిచిన మలే్‌లష్.. ఈ సారి కాంగ్రెస్, సీపీఐల పొత్తులో భాగంగా బెల్లంపల్లి సీటు దక్కించుకున్నారు. కానీ, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి చెనుముల శంకర్ బరిలో దిగడంతో మల్లేష్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ‘ఇదే నా ఆఖరి ఎన్నిక, ప్లీజ్ నా దయతలచండి..’ అంటూ సెంటిమెంట్‌తో ప్రచారం చేస్తున్నారు.
6. ఇక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న డి.శ్రీనివాస్ మరో ‘సెంటిమెంట్’తో వెళుతున్నారు. 2009 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి వివాదాస్పద వ్యాఖ్యలతో ‘చెయ్యి’ కాల్చుకున్న డీఎస్.. ఈ సారి రూరల్ స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కమలం ఇచ్చిన షాక్‌ను దృష్టిలో పెట్టుకొని... ఈ సారి కారు పరుగును దాటాలంటే సెంటిమెంట్ పండించాల్సిందేననే అంచనాకు వచ్చారు. ‘‘నేను గెలిస్తే పెద్ద పదవిలో ఉంటా. మన నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తా..’’ అంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు.
7. బాన్సువాడ బరిలో షి‘కారు’ చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనకిదే ఆఖరు ఎన్నిక.. వయస్సుపై బడటంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదోనంటూ ప్రచారం చేస్తున్నారు.
8. కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆది శ్రీనివాస్ వరుసగా మూడోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్‌ఎస్ ప్రత్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆరాటంతో.. కాషాయ జెండా పట్టుకొని పోటీలో నిలిచారు. ‘ఈ సారైనా నన్ను గెలిపించండి..’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నారు.
9. జగిత్యాలలో సీనియర్‌నేత జీవన్‌రెడ్డి సైతం ‘నాకో చివరి అవకాశం ఇవ్వండి..’ అంటూ ఓటర్లలో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ఇక్కడ తొమ్మిదిసార్లు పోటీ చేసి.. అయిదుసార్లు గెలిచిన జీవన్‌రెడ్డి.. గత ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్థి ఎల్.రమణపై ఓడిపోయారు. ముక్కోణపు పోటీలో ఎలాగైనా గెల వాలనే తాపత్రయంతో సెంటిమెంట్‌ను పండిస్తున్నారు.
10. ఖమ్మం జిల్లాలో వనమా వెంకటేశ్వరరావు ఇది ఆఖరి పోరాటమంటూ ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఫ్యాన్ గాలితో పాటు తనదైన సెంటిమెంట్‌నూ పండిస్తున్నారు. ‘‘ఇదే నా ఆఖరి పోరాటం. గౌరవప్రదమైన పదవీ విరమణ కల్పిం చండి..’’ అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్లీజ్!
Published Sat, Apr 26 2014 3:56 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement
Advertisement