గద్వాల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలకు మంచిపాలన లభిస్తుందని మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డీకే.సమరసింహారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా శుక్రవారం ఉదయం గద్వాలలోని వైఎస్సార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి పెచ్చరిల్లిందన్నారు. గద్వాలలో రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం పెరిగిపోయి, ప్రజలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజ్యాంగేతర శక్తులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అందువల్ల ప్రజలు టీడీపీని గెలిపించి మంచిపాలనను పొందాలని అన్నారు.
సంక్షేమ పథకాల నుంచి కాంట్రాక్ట్ పనుల వరకు అవినీతి పరుల జోక్యం పెరిగిందన్నారు. అధికారులను సైతం బెదిరిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి వివిధ రకాల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. విలేకరులు తమకు అనుకూలంగా రాయడం లేదని బహిరంగ వేదికల్లోనే విమర్శించే స్థాయిలో అధికార దాహం నెత్తికెక్కించుకున్నారని, ఇది సరైందికాదని విమర్శించారు. టీడీపీ ప్రజలకు సంక్షేమ పాలన అందించడంతోపాటు, అభివృద్ధిని వేగవంతం చేస్తుందని, ప్రజా పాలన అందించే సత్తా తమకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కల రమాదేవి, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.