ప్రజల కష్టాలెరిగిననేత జగన్
జగన్‌తోనే మళ్లీ వైఎస్సార్ సువర్ణయుగం: విజయమ్మ
కులమతాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్‌దే
చంద్రబాబు ఇంతవరకు ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయలేదు
మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి, బెల్టుషాపులు తెరిచిన ఘనుడు బాబు
పులివెందుల : నిత్యం ప్రజల్లో తిరుగుతూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతోపాటు, ప్రజల గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే మళ్లీ వైఎస్సార్ సువర్ణయుగం తెస్తారని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోలో ఆమె అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు రుణ మాఫీతోపాటు పేదలకు రూ.2 కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేసి పేదలకు మేలు చేసిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డేనన్నారు.
కులమతాలు, ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాల ఫలాలు అందించిన వ్యక్తి వైఎస్సేనని గుర్తుచేశారు. ఫీజుల పథకంతో ప్రతి పేదోడి ఇంటి నుంచీ ఒకరిని డాక్టర్‌నో, ఇంజనీరునో చేయాలని వైఎస్ తపించారన్నారు. కరెంటు, ఆర్టీసీ, నీరు, మున్సిపాలిటీ పన్నులు పెంచని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ ప్రభుత్వమేనని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే..
చంద్రబాబు వల్లే వీధివీధినా బెల్టుషాపులు..
చంద్రబాబు హయాంలో రూ.75 వేలు పింఛన్.., అది కూడా ఏ మూడు నాలుగు నెలలకో ఇస్తే, వైఎస్ హయాంలో వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు నెలనెలా పింఛన్ అందించారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి, బెల్టుషాపులను వీధి వీధినా తెరచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌ను ప్రధాని చేయాలని మన రాష్ట్రాన్ని విభజిస్తే, బీజేపీ చిన్నమ్మను నేనున్నానంటూ మద్దతిచ్చింది. చంద్రబాబేమో మీ ఇష్టమొచ్చినట్లు రాష్ట్రాన్ని విభజించుకోండాని లేఖ రాసిచ్చేయడం దురదృష్టకరం. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డేమో విభజనకు పూర్తిగా సహకరించారు.
ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. అన్ని పార్టీల నాయకులు మీ వద్దకు వస్తారు. వారు చెప్పే మోసపూరిత మాటలను నమ్మొద్దు. విశ్వసనీయత కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచండి. ఉప ఎన్నికలలో పార్టీకి ఎలాంటి మెజార్టీ అందించారో.. అలాంటి మెజార్టీ మరోమారు అందించాలని ప్రజలందరినీ కోరుతున్నా.