న్యూస్‌లైన్ టాస్క్‌ఫోర్స్ : ‘కదిరికి చెందిన టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాయల మరాఠీగా పేరుగాంచారు. డీడీల కుంభకోణంతో కోట్లకు పడగలెత్తారు. డబ్బు తీసుకుని ఎగ వేయడంలో ఆయనకు ఆయనే సాటి.
గతంలో మహారాష్ట్ర బ్యాంకుకు సంబంధించి కోట్లాది రూపాయల నకిలీ డీడీలను చలామణి చేసి ఆ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఈయన కదిరి నియోజకవర్గ వాసులకు అప్పుడప్పుడు మెరుపు తీగలాగా కనిపించి వెళ్లిపోతుంటాడు. ఆఖరుకు కదిరికి చెందిన టీడీపీ నేతల వద్ద రూ.5లక్షలు,రూ. 10లక్షలు అప్పు తీసుకుని దాన్ని ఎగవేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయ’ని కదిరి నియోజకవర్గంలో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. డబ్బు ఎగవేసిన విషయంలో గతంలో జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన హనుమంతరాయ చౌదరి వద్ద పంచాయతీ పెట్టి.. సగం మొత్తం మాత్రమే చెల్లించిన ఘన చరిత్ర ఈయనదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
కదిరికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలి నుంచి రూ.10 లక్షలు తీసుకుని ఆమెకు తిరిగి చెల్లించకపోవడంతో ఆమె హనుమంతరాయచౌదరి వద్ద పంచాయతీ పెట్టించి రూ.4 లక్షలు రాబట్టుకుంది. ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అప్పు ఇచ్చిన వారు తిరిగి వసూలు చేసుకునేందుకు కందికుంట ఇంటివద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయడం పరిపాటి. అక్కడికి వచ్చే వారు మాత్రం కందికుంట ఇంటి వద్ద జనాన్ని చూసి అభిమానులేమో అనుకుంటారు కానీ అప్పు ఇచ్చిన వారన్న విషయం చాలా మందికి తెలియదు. బెంగుళూరులో రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన మోసాలు అనేకం ఉన్నాయి.
యలహంక, గాంధీనగర్, మల్లేశ్వరం, జేపీనగర్, తదితర తెలుగు వారు నివాసం ఉండే ప్రాంతాల్లో వెంచర్లు వేసి ఆభూములను రిజిస్ట్రేషన్ చేయకుండా కోట్ల రూపాయాలు దిగమి ంగిన ఘనత కందికుంటకే దక్కుతుందని బాధితులు వాపోతున్నారు. కందికుంటపై బెంగళూరు, ముంబాయిలో పలుసెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పచ్చచొక్కా ధరించే నాయకుడు ఆ రాష్ట్రాలో మాత్రం 420 ‘ఛీ’టింగ్ కేసులు అనేకం ఎదొర్కుంటున్నారు. కందికుంట చేసే అక్రమ దందా గురించి ఆ పార్టీలో తెలియని వారు లేదనడం అతిశయోక్తి కాదు. ఈ దెబ్బతో కందికుంటకు కదిరిలో అప్పులిచ్చే వారే కరువయ్యారు. దీంతో ఆయన చూపు బెంగళూరు, ఇతర పట్టణాల్లో ఉన్న వారిపై పడింది. వారితో పరిచయాలు పెంచుకోవడం.. అప్పులు తీసుకోవడం.. ఎగ్గొట్టడం.. ఇదే ఇతని పని అని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.
పరిటాల అండతో ఎదిగిన కందికుంట
2004లో మహారాష్ట్ర బ్యాంకుకు సంబంధించి కోట్లాది రూపాయల నకిలీ డీడీలను తయారు చేసిన కందికుంట వాటిని మార్కెట్‌లో చలామణి చేసి కోట్లు కొల్లగొట్టారు. ఈ విషయం బయట పడడంతో అప్పటి మహారాష్ట్ర, ఆంధ్రా పోలీసులు సంయుక్తంగా దాడిచేసి కందికుంటపై 420 చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఆయనను టీడీపీకి చెందిన దివంగత ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర వెనకేసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయంలో కదిరి ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పరిటాల రవి కందికుంటను తన ఏజెంటుగా కదిరికి పంపించి రాజకీయ రంగ ప్రవేశం చేయించారని అప్పట్లో చర్చసాగింది. అయితే బిజేపీతో పొత్తు కారణంగా కదిరి స్థానాన్ని టీడీపీ వదులుకోగా, అసంతృప్తికి గురైన కందికుంట స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీన్ని సహించలేని చంద్రబాబు ఆయనపై జీవితకాలపు నిషేధాన్ని విధిస్తూ.. టీడీపీ నుంచి బహిష్కరించారు. భారీగా పార్టీ ఫండ్ ఇవ్వడంతో చంద్రబాబు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులను స్వయంగా కందికుంటే నడిపించారు.
ఆ తరువాత 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బత్తల వెంకట్రమణపై గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ టికెట్టు ఆశించి భంగపడిన వారంతా కందికుంటకు మద్దతు పలకడం వల్లే ఆయన గెలుపొందారనే అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో గెలుపొందిన నాటి నుండి వైఎస్ మరణం వరకు రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేని కందికుంట మహానేత మరణం తరువాత యధేచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సొంత నిధులతో అభివృద్ది పనులు చేస్తున్నానంటూ ప్రచారం చేయించుకునే ఆయన.. సీడీపీ నిధులు ఏఏ పనులకు వినియోగించారో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక వక్ఫ్ బోర్డు భూములు, క్రిష్టియన్ ఆస్తులను బహిరంగంగా ఆక్రమించుకుంటు న్నా..స్పందించే నాథుడే కరువయ్యాడు.
ముచ్చటగా మూడోసారి కదిరి నుంచి పోటీ చేస్తున్న కందికుంట టీడీపీ టికెట్టు సాధించుకోవడానికి నానాపాట్లు పడ్డారు. పొత్తుల్లో భాగంగా కదిరి స్థానాన్ని బీజేపీకి కేటాయించకుండా చూసేందుకు టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్ సీఎం రమేష్‌కు భారీ స్థాయిలో ముడపులు అందించినట్లు విమర్శలు ఉన్నాయి. ఆయన చొరవతో టికెట్టు సాధించుకున్న కందికుంట ఇప్పుడు ఏటికెదురీదుతున్నారు. ఇటీవల చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కదిరికి వచ్చినపుడు కందికుంట మాట్లాడిన వ్యాఖ్యల పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కదిరిలో తనను ఓడించే మగాడు ఇంత వరకు పుట్టలేదని వ్యాఖ్యానించడం కందికుంట మానసిక స్థితికి అద్దంపడుతోందని, ఆయనకు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని స్థానికులు వేచి ఉన్నారు.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి 2011లో నోటిఫికేషన్ వెలువడగా, గత ఏడాదిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ పోస్టులను ఇప్పిస్తామంటూ అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న కందికుంటతో పాటు పలువురు టీడీపీ నేతలు భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశారు. ఆర్హత లేకపోయినా పోస్టులు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. అయితే అధికారులు నిబంధనల మేరకు నడుచుకోవడంతో టీడీపీ శ్రేణులు ప్రతిపాదించిన చాలా మందికి పోస్టులు దక్కలేదు. పోస్టులు రాని మహిళలు, వారి భర్తలు తమ డబ్బు తమకు వాపసు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఎమ్మెల్యే అప్పటికప్పుడు కొత్త ఎత్తుకు తెరతీశారు. పోస్టుల భర్తీలో అర్హులకు అన్యాయం జరిగిదంటూ అప్పటి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లెరఘునాథరెడ్డితో కలసి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఐసీడీఎస్ పీడీని దుర్బాషలాడారు. మనస్తాపం చెందిన అధికారులు ఆ నియామకాలను ఆపివేయడంతో అప్పటికే ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల పాటు పోస్టుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పట్లో వారు పడిన మానసిక వేదనకు కారణమైన కందికుంటకు తగిన బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని అంగన్‌వాడీలు ఎదురు చూస్తున్నారు. ఈ విషయం కనుక్కున్న కందికుంట అంగన్‌వాడీ సంఘాల లీడర్లలో తమకు అనుకూలమైన వారిని రాయబారులుగా పంపుతూ వారి ఆగ్రహం తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
ఓటమి భయంతో బెంబేలు!
పైకి ధీమాగా నటిస్తున్న కందికుంటను ఓటమి భయం పీడిస్తోంది. ముఖ్యంగా తనకు దూరమైన మైనార్టీ వర్గాలను ఆకట్టుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా షాదీ మహల్‌కు రూ.60 లక్షలు సొంత నిధులు ఖర్చు పెట్టానని ప్రచారం చేసుకుంటున్నారు. వక్ఫ్ భూములు కబ్జా చేసి.. పైకి ప్రేమ నటిస్తున్న ఆయన్నెవరు నమ్ముతారని మైనార్టీలు కుండబద్ధలు కొడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలు వైఎస్సార్‌సీపీకి దక్కాయి. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు వెల్లడైంది. ఈ ఫలితాలను ముందుగానే అంచనా వేసుకున్న కందికుంట.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామ స్థాయి వైఎస్సార్‌సీపీ నాయకులను బెదిరిస్తుండడంతో పాటు అక్రమ కేసులు బనాయింపజేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు మైనార్టీలు తనవెంటే ఉన్నారని చెప్పుకోవడానికి ప్రతిరోజూ కొంత మందిని పార్టీలోకి చేర్పించుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు.
ఇక్కడ లీడర్.. అక్కడ ‘ఛీ’టర్!
Published Sun, May 4 2014 1:59 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement