
జగన్ రాకతో జనసంద్రమైన పులివెందుల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సందర్భంగా పులివెందుల పట్టణం జనసంద్రమైంది.
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సందర్భంగా పులివెందుల పట్టణం జనసంద్రమైంది. మహానేత తనయుడిని చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ బారులు తీరారు. జగన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా పూల అంగళ్ల సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మళ్లీ రాజ్యన్న రాజ్యం తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటిని అమల్లోకి తీసుకు వస్తామన్నారు. ఓటు ద్వారా కాంగ్రెస్, టీడీపీ కుళ్లు, కుట్రలను తప్పికొట్టాలని జగన్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం జగన్ వాహనంపై నుంచి అభివాదం చేస్తూ అక్కడ నుంచి నామినేషన్ సెంటర్కు బయల్దేరారు. జూబ్లీ బస్టాఫ్, నాలుగు రోడ్ల సర్కిల్, తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను జగన్ అందజేస్తారు.
అంతకు ముందు ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద జగన్ మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆయన వెంట.... సతీమణి వైఎస్ భారతీ, ఇతర కుటుంబ సభ్యులున్నారు. వైఎస్ఆర్ ఘాట్ మీద నామినేషన్ పత్రాలు ఉంచి జగన్ నివాళులు అర్పించారు.