పరిటాల శ్రీరాం వాహనాల్లో మారణాయుధాలు
అక్రమ ఆయుధాలతో పట్టుబడిన 2 స్కార్పియోలు
నాలుగు నంబర్ ప్లేట్లు, వాకీ టాకీలు స్వాధీనం
ఘటన స్థలం నుంచి పారిపోయిన శ్రీరాం, అనుచరులు
అనంతపురం రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిటాల సునీత ప్రచార వాహనాల ను తనిఖీ చేస్తుండగా రెండు అనుమతి లేని వాహనాల్లో మారుణాయుధాలు, నెంబరు ప్లేట్లు, వాకీ టాకీలు, పలు కేసుల్లో నిందితులను పోలీసులు గుర్తించారు. వారు తేరుకునే సరికి పరిటాల శ్రీరాం సహా అనుచరులు.. ఆయుధాలు, ఇతర వస్తువులను తీసుకుని వెనుక ఉన్న వాహనాల్లో ఉడాయించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం రాత్రి 10.30 గం.లకు పరిటాల సునీత తరఫున ఆమె కుమారుడు శ్రీరాం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇతని కాన్వాయ్‌లో అనుమతి లేని వాహనాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు బసంపల్లి వద్ద తనిఖీల కోసం వాటిని ఆపారు. వాటిలో రెండు బ్లాక్ స్కార్పియోలకు అనుమతి లేకపోవడంతో వాటిని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని చెప్పారు. అయితే ఆ వాహనాల్లో అక్రమ ఆయుధాలు, వాకీటాకీలు, నంబర్‌ప్లేట్లు, మందు బాటిళ్లు కూడా ఉన్నాయి.
ఇవి పోలీసులకు చిక్కకుండా శ్రీరాం.. ఆయన అనుచరులు వాటిని చేతబట్టుకుని పరుగున వెళ్లి వెనుక ఉన్న వాహనాల్లో అక్కడి నుంచి పారిపోయారు. అనుమతి లేని ఆ రెండు వాహనాలను మాత్రం పోలీసులు సీజ్ చేసి చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వాహనాల్లో తగరకుంట కొండారెడ్డి హత్యకేసులో నిందితుడు తగరకుంట వినయ్‌కుమార్‌తో పాటు కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యాయత్నం కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు సమాచారం. వీరంతా పోలీసులకు దొరకకుండా పారిపోయారు. కొంత మంది పోలీసులు ఈ విషయాన్ని గమనించినా, వాహనాలపై మాత్రమే వారు దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ సంఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.