ఇది పేదల గుండె చప్పుడు | It is the heartbeat of the poor | Sakshi
Sakshi News home page

ఇది పేదల గుండె చప్పుడు

Published Mon, Apr 14 2014 2:19 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

ఇది పేదల గుండె చప్పుడు - Sakshi

ఇది పేదల గుండె చప్పుడు

 వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్‌మోహన్‌రెడ్డి
 
  హైదరాబాద్: పేదవారి అభ్యున్నతి, నూతన రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ప్రజల్లో తిరుగుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో అవగతం చేసుకున్న అనేక సమస్యలకు పరిష్కారం దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. కొత్తగా ఏర్పడుతున్న సీమాంధ్ర రాష్ట్రానికి సరికొత్త మార్గనిర్దేశం సూచిస్తూ.. నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. అదే సమయంలో సీమాంధ్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన ఎజెండాను ఈ మేనిఫెస్టోలో ప్రకటించారు. మలివిడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో - 2014ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అందులో పొందుపరిచిన ప్రతి అంశాన్నీ ఆయన లోతుగా విశ్లేషించి చెప్పారు. మేనిఫెస్టో లక్ష్యాలను విడమరిచి చెప్పారు.

‘‘మేనిఫెస్టో విడుదల అన్నది ఏదో కొత్తగా చేస్తామన్న అంశం కాదు. ఇందులోని చాలా అంశాలు గత నాలుగే ళ్లుగా ప్రతి సందర్భంలోనూ నేను చెప్తున్నవే. ప్రతి అంశాన్నీ మేనిఫెస్టోలో తీర్చిదిద్దాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అలా రూపొందించాం. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలపై దృష్టి సారించాం. దివంగత వైఎస్సార్ ఒక సువర్ణయుగం అందించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా వైఎస్ మాత్రమే స్ఫూర్తిమంతమైన పాలన అందించారు. వైఎస్ హయాంలో ప్రతి రంగంపైనా తన ముద్ర చూపించారు. ఏ ఐదేళ్ల పాలన చూసుకున్నా వైఎస్‌ను ఎవరూ పోల్చి చూడలేరు. సువర్ణ రాష్ట్రమనే వైఎస్ స్వప్నం కన్నా మరింత గొప్పగా మా పాలన ఉంటుంది. వైఎస్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రుల పాలన ఎలా ఉంది.. వైఎస్ హయాంలో ఎలా ఉందీ.. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పాలించిందీ.. అనే అంశాలపై వ్యత్యాసం చూపిస్తాం. దిక్సూచిలా ఉంటాం. మా పాలన పేదవాడి గుండెచప్పుడు అని గర్వంగా చెప్పుకుంటాం. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాం’’ అంటూ జగన్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను సుదీర్ఘంగా వివరించారు. ఆయన చెప్పిన
 
ముఖ్యాంశాలివీ...
 చనిపోయినా ప్రతి గుండెలో నిలిచిపోవాలి

 
 ‘‘నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.. ఇచ్చిన మాట కోసం ముందుకు నడిచా. రాష్ట్రంలో నేను తిరిగినన్ని ప్రాంతాలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తిరగలేదు. ఇలా ఇంటింటా తిరక్కుండా ఓదార్పు చేయకపోతే సోనియాగాంధీ నాకు పదవులిస్తామన్నారు. మంత్రిని చేస్తామన్నారు. సీఎంను చేస్తానన్నారు. ఓదార్పు వద్దన్నారు. అయితే ఇచ్చిన మాట కోసం ఓదార్పుకే సిద్ధపడ్డాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు. చనిపోయిన తర్వాత ప్రతి గుండెల్లో నిలిచిపోవాలి. నేను చనిపోతే ప్రతి ఇంట్లో నా ఫొటో కనిపించాలి. నాన్న ఫొటో పక్కనే నా ఫొటో ఉండాలి.’’
 
 ఆంధ్ర, రాయలసీమ పదాలతో కొత్త రాజధాని
 
 తెలుగువారికి ఐక్యతే బలం. రాష్ట్రాన్ని విడగొట్టారు.. భూమిని విడగొట్టగలిగారు గానీ మనసుల్నీ, మనుషుల్నీ ఎవరూ విడగొట్టలేరు. తెలుగుజాతినీ, మనుషుల్నీ ఎవరూ వేరు చేయలేరు. రెండు రాష్ట్రాలకూ వేర్వేరు మేనిఫెస్టోలిచ్చాం. సమస్యలు వచ్చినపుడు పరస్పరం అక్కడి వారు, ఇక్కడి వారు తోడుగా ఉన్నారు. హైదరాబాద్ వెళ్లిపోయింది. దురదృష్టమో అదృష్టమో గానీ.. రాజధానికి దూరంగా 180 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. వీలైనంత త్వరగా వెళ్లిపోదాం. నేనే దగ్గరుండి పనులు చేయిస్తా. రాష్ట్రానికి నడి మధ్యలో రాజధాని ఉంటుంది. అందరికీ సులభంగా, రవాణా సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతా. భూమి, నీరు, అభివృద్ధి ఉన్న చోటే రాజధాని ఉంటుంది. రాయలసీమ, ఆంధ్రా పదాలు వచ్చేలా రాజధాని పేరు ఉంటుంది. హైదరాబాద్‌ను మించిన మహానగరాన్ని సీమాంధ్రకు రాజధానిగా నిర్మిస్తా. గార్డెన్ సిటీ, సువిశాలమైన పార్కులు, నాణ్యమైన విద్య అందించే విద్యాలయాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటాం. 25 ఫ్యాకల్టీ ఆసుపత్రులు అందులో ఉంటాయి. వాటన్నింటినీ ఒక వైద్య యూనివర్సిటీకి అనుసంధానం చేస్తా. దేశంలో అందరూ కొత్త రాజధాని గురించి పదే పదే చర్చించుకునేలా తీర్చిదిద్దుతా. చాలా వేగవంతంగా రాజధాని నిర్మాణానికి కృషి చేస్తాం. ‘యాక్షన్ షేర్’ వంటి బహుళజాతి సంస్థలతో కూడా ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సంప్రదింపులు జరిపా. అన్ని వర్గాల వారికీ అవసరమయ్యేలా సిటీని అభివృద్ధి చేస్తా. జీవీకే తరహా పారిశ్రామికవేత్తలు పక్క ప్రాంతాలవైపు చూడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఈ నేపథ్యంలో ఉద్యోగాలూ వస్తాయి. నా సొంత తమ్ముడికి ఉద్యోగం కోసం ఎలా కృషి చేస్తానో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇప్పిం చేందుకు అలాగే ప్రయత్నిస్తా. యువతను ఆదరిస్తా.
 
 ఉద్యోగులు గర్వపడేలా పీఆర్సీ ఇస్తా
 
 సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో చిరునవ్వు కనిపించాలి. వారికి ఇబ్బందులు లేకపోతే నిరుపేదల వ ంక సానుభూతితో చూస్తారు. వాళ్లను కుంటుంబ సభ్యుల్లా ఆదరించాలి. చంద్రబాబు ఉద్యోగులకు 16 శాతం పీఆర్సీ ఇచ్చారు. వైఎస్ తన హయాంలో 39 శాతం పీఆర్సీ ఇచ్చారు. ఉద్యోగులంతా గర్వపడేలా నేను వారికి పీఆర్సీ ఇస్తా. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధం చేయడానికి ఒక కమిటీని నియమిస్తాం. ఆ కమిటీ నిర్ణయించిన విధంగా వారిని క్రమబద్ధీకరిస్తాం. క్లాస్-4 ఉద్యోగికి కూడా ఇల్లు ఉండేలా చేస్తా. హెల్త్ పాలసీ తీసుకొస్తాం. సమ్మె కాలంలో జీతం ఇప్పిస్తాం.
 
  చంద్రబాబులా దొంగ హామీలివ్వలేను
 
 వ్యవసాయ రంగానికి సంబంధించి చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నారు. నేను చెప్పేవి చేస్తాను. బాబు 1 లక్షా 27 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను రద్దు చేస్తానని చెప్తున్నారు. చంద్రబాబును ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నా.. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రుణాలు రద్దు చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? కనీసం వడ్డీ లేని రుణాలైనా ఇచ్చావా? మహిళల డ్వాక్రా రుణాలను కూడా కలిపితే మొత్తం 1 లక్షా 50 వేల కోట్ల రూపాయలవుతాయి. మొత్తం రాష్ట్ర బడ్జెట్ 1 లక్షా 27 వేల కోట్లు అయితే దానికన్నా ఎక్కువగా ఉన్న రుణాలను ఎలా రద్దు చేస్తావు? అలాంటి హామీలు నేను ఇవ్వలేక పోయినా.. అక్కా చెల్లెళ్ల డ్వాక్రా రుణాలు రూ. 20 వేల కోట్లు రద్దు చేస్తా. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలిస్తా. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా బాబూ? మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అంటే 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటున్నావు. రాష్ట్రం ఏర్పడిన 65 ఏళ్లలో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. పగటిపూట దొంగ అబద్ధాలు చెప్పే బాబు ఇక హామీలను ఎలా నెరవేరుస్తారు? నేను బాబు మాదిరిగా అబద్ధాలు చెప్పను.. కానీ చదువుకున్న ప్రతి విద్యార్థికీ నా సొంత తమ్ముని మాదిరిగా ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తా. ఐటీ రంగం కన్నా పెట్రో కెమికల్ రంగంలో జీతాలెక్కువ. అందుకే పెట్రోకెమికల్ యూనివర్సిటీలు నెలకొల్పుతాం. విశాఖను చూస్తే కొంత బాధేస్తే, మరికొంత ఆనందం కలుగుతోంది. అక్కడ విపరీతమైన కాలుష్యం ఉంది. పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేస్తా. ప్రతి స్కూల్‌నూ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా చేస్తాం. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా చూస్తాం.
 
 అన్నదాత మోములో చిరునవ్వు కనిపించాలి

 రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందే. కరువు, వరదల సమయంలో ఆసరాగా ఉండాలి. అందుకోసం రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాం. నీలం తుపాను నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు.. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా రూ. 2 వేల కోట్లతో ‘కాలామిటీ రిలీఫ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తాం. ఎంత యూరియా వేయాలి, భూసార పరీక్ష వంటి అంశాల్ని తెలుసుకునేందుకు ప్రతి రెండు జిల్లాలకు ఓ వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తాం, వ్యవసాయ, పశుసంవర్థక విభాగానికి సంబంధించి మూడు యూనివర్సిటీలను నెలకొల్పుతాం. రైతన్నకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసిన 20 నిమిషాల్లో 102 వాహనం, పశువులు, రోగాలకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు 103 వాహనం అనే మొబైల్ వాహనాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి జిల్లానూ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దుతాం. దేశంలో ఈ తరహా పద్ధతి మరెక్కడా లేదు. దీనివల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలూ లభిస్తాయి.
 
ఐదేళ్లలో విద్యుత్ కోతల్లేని రాష్ట్రం

 ఏ గ్రామంలో చూసినా విద్యుత్ కోతలే కనిపిస్తున్నాయి. 2014-2019 లోగా కరెంట్ కోత అనేది లేని రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. ఇప్పుడు వ్యవసాయానికి ఏడు గంటల సరఫరా అంటున్నా అది పేరుకే. రాత్రి కొంత. పగలు కొంత. అది కూడా నిలకడ లేని విద్యుత్. రాత్రుళ్లు మోటార్లు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి. రైతన్నలకు పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తాం. పేదల గుడిసెల్లో కరెంట్ బిల్లు షాకిస్తోంది.. దీనివల్ల విద్యుత్ సరఫరా, వినియోగంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. 3 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ వాడుకునే కనెక్షన్‌ను రూ. 100 బిల్లుకే అందిస్తాం.

 మండలానికి ఒక్కటే మద్యం దుకాణం..: బెల్ట్ దుకాణాల వల్ల యువకుల జీవితాలు పాడైపోతున్నాయి. భవిష్యత్తులో బెల్ట్ దుకాణాలే లేకుండా చేస్తాం. పంచాయతీల్లో మేం నియమించే మహిళలు ఈ దుకాణాల నియంత్రణ చూస్తారు. నియోజకవర్గం మొత్తం ఒకే ఒక్క మద్యం దుకాణం ఉంటుంది.  స్టార్ హోటళ్లలోనే మద్యం దొరుకుతుంది. రేట్లు చూస్తే సూపర్ షాక్ తగిలేలా ఉంటాయి. పేదలకు ఏటా పది లక్షల ఇళ్లు నిర్మిస్తాం..: ఇల్లు ఇస్తే పట్టాలివ్వరు. బ్యాంకుల్లో మార్జిన్‌మనీ బాధ. అందుకే ఏటా 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తాం. బ్యాంకర్లతో మాట్లాడి అదే పట్టాపై పావలా వడ్డీపై 30, 40 వేలు రుణం అందేలా చూస్తాం. దీనివల్లా 10 లక్షల మంది లబ్ధి పొందుతారు.

 ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం, అనాథాశ్రమం..: గ్రామాల్లో నీడ లేక అవ్వా, తాతలు ఇబ్బందులు పడటం నేను చూశా. వచ్చే పింఛన్ కూడు పెట్టినా నిలువ నీడ ఉండడం లేదు. అందుకే ప్రతి నియోజకవర్గానికో ఓల్డేజ్ హోం (వద్ధాశ్రమం) - ఆర్ఫాన్ హోం (అనాధాశ్రమం) కట్టిస్తాం. ఇకపై ప్రతి మండలానికీ ఈ వ్యవస్థ విస్తరిస్తాం. పింఛనుకు అర్హత 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. అన్ని కార్డుల జారీ గ్రామాల్లోనే..: వార్డుల్లో ఎక్కడకు వెళ్లినా రేషన్ కార్డులేదు, ఇల్లు లేదు.. అంటున్నారు. ఇకపై ప్రతి పంచాయతీలోనూ శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసి 24 గంటల్లో అన్ని రకాల కార్డులందేలా చేస్తాం.  గ్రామాల్లో మహిళా పోలీసులు..: కులాలవారిగా 10 మంది చదువుకున్న మహిళల్ని ఎంపిక చేయడం ద్వారా రాష్ట్రంలో సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ భరోసా కల్పిస్తాం. మహిళా పోలీసులుగా పిలిచే వాళ్లు గ్రామాల్లో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేలా కృషి చేస్తారు.’’
 
 
 చాలెంజ్.. అవినీతి లేని పాలన అందిస్తాం

 ‘‘అవినీతి గురించి అందరూ మాట్లాడుతున్నారు.. కానీ అవినీతి రహిత పాలన ఎలా ఉండాలో చెప్పడం లేదు. అందుకే మేం చేసే పాలనను అత్యంత పారదర్శకంగా ఉంచుతాం. ఎవరూ వేలె త్తి చూపించకుండా వ్యవస్థల్లో మార్పులు తీసుకువస్తాం. ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు, పనులు చేసిన తరువాత వాటిని ‘కాగ్’ లాంటి సంస్థలు తప్పుపట్టడం కనిపిస్తోంది. కానీ.. మా ప్రభుత్వమే హైకోర్టు వద్దకు, కాగ్ వద్దకు వెళ్లి ఫైళ్లు చూపించేలా చేస్తాం.. మా ఆలోచనలు, ప్రణాళికలు వివరిస్తాం. సలహాలు, సూచనలు అందించమంటాం. ఏం చేస్తే బావుంటుందో చెప్పమంటాం. ఒక కాల పరిమితి ప్రకారం (టైం బౌండ్) సూచనలు కోరుతూ ఫైల్‌ను డిస్పోజల్ చేయమంటాం. అదే పద్ధతిలో టెండర్ల ప్రక్రియ సాగుతుంది. ఒక్కసారి అనుమతి ఇచ్చాక మాత్రం వాటిని తప్పుపట్టొద్దని చెప్తాం. తరువాత ‘ఈనాడు’ వంటి పత్రికలు వాటిని వక్రీకరించి వార్తలు రాస్తే కోర్టు ధిక్కారం కింద జైల్లో పెట్టమంటాం. ఏం చేసినా ఈనాడు బండలేస్తోంది.. ఏ మంచి పని చేసినా తప్పేనంటోంది. అయినా చాలెంజ్.. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఉంటుంది.’’
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement