
జనంలో చైతన్యం కోసమే జనసేన: పవన్
శంషాబాద్, న్యూస్‌లైన్: జనంలో చైతన్యం కోసమే జనసేన పార్టీని స్థాపించినట్లు సినీనటుడు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నం నుంచి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉండడం లేదన్నారు. ఏ పార్టీకి ఓటు వేయాలని మీరు కోరుతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.
పవన్ ఓట్లు వేయమన్నది నాకే: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని జనసేన పార్టీ నేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం సభలో చెప్పారని టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు చెప్పుకొన్నారు. సినీనటి సన, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీరంగనాథరాజు, మోషెన్ రాజు తదితరులు టీడీపీలో చేరిన సందర్భంగా శుక్రవారం ఎన్‌టీఆర్ భవన్‌లో ఆయన మాట్లాడారు. పవన్ వ్యాఖ్యల్ని పలుమార్లు ఉటంకిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈసారి ఓట్లు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని పవన్ చెప్పారన్నారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నామని, ఇది ప్రయోగాలకు సమయం కాదని అంతకు ముందే తాను పవన్ ఎన్నికల్లో పోటీని ఉద్దేశించి వ్యాఖ్యానించానన్నారు.
పవన్‌కల్యాణ్‌ది మోడీయిజం: రాఘవులు
సాక్షి, విజయవాడ: ‘‘పవన్ కల్యాణ్ కొత్తగా పార్టీ పెడితే ఏదో చేస్తారనుకున్నాం. తీరా పవన్ చెప్పిన ఇజం మోడీయిజమని ఆయన ప్రకటనతో తేలిపోయింది’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శుక్రవారం విజయవాడలో రాఘవులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ చెబుతున్న ఇజాలు ప్రజలకు అవసరం లేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించేవారు కొత్తగా చేయగలిగే మార్పు ఏమీ ఉండదన్నారు. ప్రస్తుతం కొన్ని పార్టీలు ఫిరాయింపుదార్లను ప్రోత్సహించడం ద్వారా బలపడే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇది రాజకీయాల్లో దిగజారుడు వ్యవహారమని విమర్శించారు.