సంక్షేమానికి ఓటేయండి
Published Wed, Mar 19 2014 1:41 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓటేయూలని అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై కరుణానిధి హయాంలో ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని జయ ప్రశ్నించారు. తిరువణ్ణామలైలోని సెంగం రోడ్డులోని అమ్మాపాళ్యంలో పార్లమెంట్ అభ్యర్థి వనరోజకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన ప్రచార సభలో జయలలిత పాల్గొని ప్రసంగించారు.
వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని జయలలిత గుర్తు చేశారు. ముస్లింలకు వక్ఫ్‌బోర్డు స్థలాల కేటాయింపు, నోము బియ్యంతో పాటు పలు పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. క్రైస్తవులకు జెరుసలేం వెళ్లేందుకు పలురాయితీలు కల్పించామని చెప్పారు. తాను అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో విద్యుత్ సమస్యతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుండగా, పరిశ్రమలు మూత పడే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అధికార ంలోకి వచ్చిన వెంటనే 3,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నూతన పథకాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు.
అదే గత డీఎంకే సర్కారు విద్యుత్ ఉత్పత్తికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని,కానీ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతూ ఎటువంటి నిధులు మంజూరు చేయలేదన్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని సమస్యలను గుర్తించామన్నారు. కలసపాక్కం, సెంగంలో రూ.3.77 కోట్ల వ్యయంతో పలు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించామన్నారు. జిల్లాలో వైద్య కళాశాలను ప్రారంభించామన్నారు. తిరువణ్ణామలైలో క్రీడా మైదానానికి అన్ని వసతులు కల్పించామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల వసతి కల్పించామని వివరించారు.
కళసపాక్కం నుంచి గ్రామీణులు జిల్లా ఆస్పత్రికి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి పీహెచ్‌సీకి అన్ని వసతులు కల్పించామన్నారు. గతంలో తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ కూటమిలో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి కుటుంబ అభివృద్ధి కోసమే పాటుపడిందన్నారు. ప్రస్తుతం డీఎంకే మ్యానిఫెస్టోలో నిత్యావసర ధరలను తగ్గిస్తామని కరుణానిధి తెలపడం సరికాదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ కూటమిలోని కరుణానిధికి నిత్యావసర ధరలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. డీఎంకే, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి నెలకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే కాకుండా చమురు కంపెనీలకే ధరలను పెంచే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అప్పుడు కాంగ్రెస్ కూటమిలోని కరుణానిధి ఏమి చేశారని నిలదీశారు.
వీటిన్నింటినీ అడ్డుకోలేని కరుణానిధికి ఎన్నికలు రావడంతో ఇవి గుర్తుకు వచ్చాయా? అని ఎద్దేవా చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం తెలపాలన్నారు. భారత దేశంలో ఆర్థికాభివృద్ధి ఛిన్నాభిన్నం కావడంతో పాటు రూపాయి విలువను కూడా నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు. శ్రీలంకలోని తమిళుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలందరికీ తెలుసని, ఆ సమయంలో కరుణానిధి నోరు తెరవకుండా ప్రస్తుతం లంక తమిళుల కోసం పాటు పడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కచ్చదీవుల కోసం సుప్రీంకోర్టులో కేసు వేశానని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ని 40స్థానాలు కైవసం చేసుకునేందుకు ఓటును రెండాకుల గుర్తు కు వేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి వనరోజ, జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే అగ్రిక్రిష్ణమూర్తి, నియోజకవర్గ ఇన్‌చార్జీ కమలకన్నన్, సేదు రామన్, అన్నాడీఎంకే నాయకు లు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య మంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో చెన్నైకి బయలుదేరి వెళ్లారు.
పూర్ణకుంభ స్వాగతం: ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేక హెలికాప్టర్‌లో తిరువణ్ణామలైలోని సెంగం రోడ్డులో దిగారు. అక్కడి నుంచి అన్నాడీఎంకే పార్టీకి చెందిన మహిళలు అధిక సంఖ్యలో మేళ తాళాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తిరువణ్ణామలై రాక సందర్భంగా ఎటుచూసినా అమ్మ బ్యానర్‌లతో నిండిపోరుుంది. రెండు వేల మందితో బందోబస్తు: ముఖ్యమంత్రి రాక సందర్భంగా రెండు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌత్‌జోన్ ఐజీ మంజునాథన్ ఆధ్వర్యంలో డీఐజీలు మురుగన్, తమిళ్ చంద్రన్, ఎస్పీలు ముత్తరసి, విజయకుమార్, మనోహరన్‌ల ఆధ్వర్యంలో రెండు వేల మంది పోలీసులు పాల్గొన్నారు.
Advertisement