ఓటెయ్యాలని సోహ ప్రచారం
Published Wed, Apr 9 2014 10:40 PM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM
ఓటు ఎంతో విలువైనదని బాలీవుడ్ నటి సోహ ఆలీ ఖాన్ ప్రజల్లో జాగృతిని కల్పిస్తున్నారు. నగరంలోని పుమా స్టోర్ వద్ద బుధవారం ప్రారంభమైన ‘హీరో ఎంటీవీ రాక్ ద ఓట్’ ప్రచారంలో సోహ పాల్గొన్నారు. ఓటుపై ప్రజల్లో అవగాహన కలిగించే చిత్రాలతో కూడిన టీ షర్ట్‌ను ఆమె ధరించారు. ఈ సందర్భంగా సోహ మాట్లాడుతూ...ఓటు వెయ్యనివారికి ఫిర్యాదు చేసే హక్కు లేదన్నారు. ‘ఇదో అద్భుతమైన కార్యక్రమం. ఈ ఏడాది ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందని అనుకుంటున్నా. రాజకీయాలను మార్చేందుకు ఇదే మంచి తరుణం.
ఈ కాలంలో రాజకీయాలపై యువతకు ఎక్కువ అవగాహన ఉంది. ఎంతో విలువైన ప్రతి ఓటు వేస్తే దేశ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంద’ని సోహ వివరించారు. ప్రతి ఒక్కరు పొలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్‌లో భారత్ సుపరిపాలన వ్యవస్థను కలిగి ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో చోటుచేసుకుంటున్న కుంభకోణాలు, అవినీతిని రూపుమాపేందుకు, తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటే సరైన ఆయుధమని రంగ్ దే బసంతి హీరోయిన్ సోహ ఆలీ ఖాన్ వివరించారు. ఓటు అనే ఆయుధంతో అవినీతి రాజకీయాలను తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఐదేళ్లకు ఒకసారి వినియోగించుకునే అవకాశం ఉన్న ఈ ఓటు దేశ తలరాతనే మారుస్తుందన్నారు.
Advertisement