తెరపైకి మూడో కృష్ణుడు
తెరపైకి మూడో కృష్ణుడు
Published Wed, Apr 9 2014 12:24 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, కాకినాడ :ఒకటో కృష్ణుడైపోయాడు..రెండో కృష్ణుడైపోయాడు..ఇప్పుడు మూడో కృష్ణుడు తెరపైకి వచ్చాడు. కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం తెలుగుదేశంలో సీట్ల సిగపట్లు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కాకినాడ ఎంపీ సీటుపై కన్నేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని కలిసిన చిక్కాల తన మనసులోని మాట బయట పెట్టారు. పార్టీకి వీరవిధేయుడిగా పనిచేస్తున్న తనకు కాకినాడ ఎంపీ సీటు లేదా కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరగా, పరిశీలిస్తామంటూ ‘బాబు’ బదులివ్వడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే కాకినాడ ఎంపీ సీటు ఇస్తామంటూ పోతుల వెంకట విశ్వాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. విశ్వం ఎంపీగా సరిపోడంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును తెరపైకి తీసుకొచ్చేందుకు పార్టీలోని ఒక వర్గం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించింది. ఇంతలో మామ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు నెరిపిన రాజకీయ మంత్రాంగంతో టీడీపీ గూటికి చేరిన మాజీ మంత్రి తోట నరసింహం ఇదే సీటుపై కన్నేశారు. అంతటితో ఆగకుండా బాబు జాబితా విడుదల కాకుండానే కాకినాడ ఎంపీ సీటు నాదేనంటూ ప్రకటించి పార్టీలో కలకలం సృష్టించారు. ఇప్పుడు తాజాగా పార్టీకి చెందిన మరో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు చిక్కాల రామచంద్రరావు కాకినాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు.
వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా పని చేసిన చిక్కాలను సామాజిక సమీకరణలను సాకుగా చూపి 2009లో పక్కన పెట్టేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వద్దుమొర్రో అంటున్నప్పటికీ చిక్కాలను బలవంతంగా రామచంద్రపురం నుంచి బరిలోకి దింపి బలిపశువును చేశారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన తోట త్రిమూర్తులుకు టీడీపీ ఓటుబ్యాంక్‌ను మళ్లించ డంతో చిక్కాలకు కనీసం డిపాజిట్‌కు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. రాష్ర్ట స్థాయిలో సాగిన కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు చిక్కాల బలైపోయారు. ఆర్థికంగా చితికిపోయారు. సుదీర్ఘ రాజకీయానుభవం కల్గిన చిక్కాలకు పిలిచి టికెట్ ఇస్తారని అతని అనుచరులు ఇన్నాళ్లు ఆశించారు. కానీ వలస పక్షులకే పెద్ద పీట వేస్తున్న బాబు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే చిక్కాల వంటి నాయకులకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పార్టీ శ్రేణులు మథనపడుతున్నారు. అనుచరుల ఒత్తిడి మేరకు బాబును కలిసిన చిక్కాల తన మనసులోని మాట బయటపెట్టారు.
తమ నాయకునికి కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని, లేకుంటే కనీసం కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని చిక్కాల వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. 2009లో కాకినాడ ఎంపీ సీటు బీసీలకు ఇస్తాం ఈసారి తప్పుకోండ ని చెప్పడంతో బాబు ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. 2012 ఉపఎన్నికల్లో కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి గెలుపోటములతో సంబంధం లేకుండా రామచంద్రపురం నుంచి పోటీ చేశారని చెబుతున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నిక సమయంలో కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ బాబు మొండిచేయే చూపారని, సీనియర్ అయిన చిక్కాలను కాదని ఎలాంటి అనుభవం లేని టీడీపీ పశ్చిమ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మికి ఇచ్చారని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితిపై పార్టీలో సైతం చర్చకు దారి తీస్తోంది.
Advertisement