బావమరిదికే బావ ఓటు
భీమవరం, న్యూస్‌లైన్ :గెలుపుపై ఆశలు వదిలేసుకున్న నరసాపురం సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు కుటుంట కథా చిత్రానికి తెరలేపారు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట అయిన కనుమూరి ఈ ఎన్నికల్లో కొత్త ఎత్తుగడతో రాజకీయం చేయడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలకు శత్రువుగా మారిన కాంగ్రెస్‌కు సీమాంధ్రలో నూకలు చెల్లటంతో ఆ పార్టీ తరుపున అధిష్టానం బాపిరాజును మళ్లీ బరిలోకి దింపింది. అయితే పెద్దల మాట కాదనలేక అయిష్టంగానే తిరిగి ఆ పార్టీ తరుపున నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవటంతో టీడీపీ మద్దతుతో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సొంత బావమరిది గోకరాజు గంగరాజుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
అందుకనుగుణంగానే తెరవెనుక రాజకీయాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు అనూహ్యంగా బీజేపీ టికెట్ తెచ్చుకుని పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున పోటీలో ఉండి ప్రచారం చేస్తున్న కనుమూరి బాపిరాజు కాడి వదిలేసి తూతూమంత్రంగా తిరుగుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు లోపాయికారీగా బావమరిది గెలుపు కోసం శతవిధాలా సహకరిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో మెలిగే బాపిరాజు వారిని నొప్పించకుండా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూనే తెరవెనుక మాత్రం మంత్రాంగం నడుపుతున్నారు. తన ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులకు బావమరిది గంగరాజు గెలుపునకు పనిచేయాలని చెబుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే పలువురు బాపిరాజు అనుచరులు గోకరాజు గంగరాజు పంచకు చేరుతున్నారు.
ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, కాళ్లకూరు దేవస్థానం చైర్మన్ అడ్డాల నాగరాజు, మాజీ జెడ్పీటీసీ పద్మావతి దంపతులతోపాటు ఇదే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బాపిరాజు శిబిరం నుంచి ఆయన బావమరిది శిబిరంలోకి చేరారంటున్నారు. ఇదేవిధంగా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గంగరాజు విజయం కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో మరి కొంతమంది బాపిరాజు అనుచరులు, కాంగ్రెస్ నేతలు బీజేపీ శిబిరానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. కాం గ్రెస్-బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకుని చీకటి రాజకీయాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉండి నియోజకవర్గంలో ముఖ్యనేత అడ్డాల నాగరాజు గంగరాజు శిబిరానికి వెళ్లిపోవటంతో అసెంబ్లీ బరిలో ఉన్న గాదిరాజు లచ్చిరాజు కనుమూరి బాపిరాజు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ మాత్రానికి తమను బరిలో పెట్టి బలిచేయడం చేయ డం ఎందుకని బాపిరాజు తీరును ఎండగడుతున్నారు. ఇదే రీతిగా వ్యవహరిస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కేపరిస్థితి ఉండదని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. బాపిరాజు తాను ఒడినా తన బావమరిదిని గె లిపించి పార్లమెంట్‌కు పంపేందుకు తెరవెనుక చేస్తున్న రాజకీయాలతో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త కుమ్మక్కు రాజకీయాలను తెరలేచింది.