ఇళ్ల రుణాలు మాఫీ చేస్తాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటివరకూ పేదలు తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు రెండు పడకగదులతో కూడిన ఇళ్లు కట్టిస్తామని, రైతులకు రూ. లక్ష లోపున్న పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ప్రజలు ప్రాణ త్యాగాలు చేసి, దెబ్బలు తిని, జైళ్లకు పోయి తెచ్చుకున్న తెలంగాణ నక్కల పాలు కావద్దని.. ఈ విజయం సార్థకం కావాలని వ్యాఖ్యానించారు. మంగళవారం మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఇప్పటివరకు ఉన్న ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
అర్హులైన పేదలకు 125 గజాల జాగాలో రూ. 3 లక్షల వ్యయంతో రెండు పడకగదులు, ఒక హాలు, వంటగది, మరుగుదొడ్డి, స్నానాల గదితో కూడిన ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. రైతులకు రూ. లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని, దీనివల్ల ప్రభుత్వం మీద రూ. 12 వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. తెలంగాణలో నిర్బంధ విద్యను అమలు చేస్తామన్నారు. పోలీసులను సాంఘిక సేవా కార్యక్రమాల్లో వినియోగించుకుంటామని, ఐదేళ్లు దాటిన పిల్లాడు బడిలో కాకుండా పనిలో ఉన్నట్లు తేలితే ఆ ప్రాంత ఎస్సైని సస్పెండ్ చేసే విధంగా చట్టం తెస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
రాజకీయ అవినీతిని అంతం చేస్తా..
‘‘తెలంగాణ ప్రజలకు కోటి ఆశలున్నాయి. ఆ ఆశలన్నీ తీరాలంటే ప్రజల ఎజెండా ఉండాలి. మంచి పరిపాలన జరగాలి. అందుకు కచ్చితంగా రాజకీయ అవినీతి అంతం కావాలి. మీ అందరి సాక్షిగా చెబుతున్నా రాజకీయ అవినీతిని నూటికి నూరు శాతం పాతరేస్తా. రాజకీయంగా రూపాయి కూడా అవినీతి జరగకుండా నిబద్ధతతో, నీతితో ప్రజలకు పాలన అందిస్తా...’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతిరెడ్డిపాడు కాలువ పనులు చకచకా పూర్తవుతున్నాయని... కానీ మెదక్ జిల్లాలో ఉన్న చిన్న కాల్వ సింగూరు పనులు ఎందుకు పూర్తికావడం లేదని ప్రశ్నించారు. తూర్పు మెదక్ జిల్లాకు మిడ్‌మానేరు నుంచి నీళ్లు వస్తాయని చెప్పారు. సింగూరు ప్రాజెక్టును ఆందోల్, నిజామాబాద్ జిల్లా రైతుల కోసం కడితే... ఆంధ్రోళ్లు హైదరాబాద్‌కు ఆ నీళ్లను తరలించుకుపోయారని వ్యాఖ్యానించారు. ‘‘హైదరాబాద్ నగరం ఉండేది కృష్ణా బేసిన్‌లో... హైదరాబాద్‌కు నీళ్లు కృష్ణా నది నుంచి రావాల్సిందే. సింగూరు నీళ్లు మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందాల్సిందే. మన ఇళ్ల ఇప్పటికే ఆంధ్ర మేస్త్రీలు నాశనం చేసిండ్రు. కూలిన మన ఇళ్లు మళ్లీ సదురుకుంటానికి కొత్త మేస్త్రీ కావాలె. ఆ మేస్త్రీ పనిచేయడానికి టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
లక్ష ఎకరాలకు సాగు నీరు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉద్యోగులను ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి కనీసం మూడేళ్ల వరకు బదిలీ చేయబోమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని.. వితంతువులకు, వృద్ధులకు రూ. 1,000 పింఛన్.. వికలాంగులకు రూ. 1,500 పింఛన్ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని కట్టిస్తామని, ఒక్కొక్కరికి రూ. లక్ష జీతం ఇచ్చి నలుగురు వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రిని, జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కడతామని హామీ ఇచ్చారు.