కేసీఆర్ వర్సెస్.. | kcr verses opposition | Sakshi
Sakshi News home page

కేసీఆర్ వర్సెస్..

Published Sun, Apr 13 2014 2:02 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

కేసీఆర్ వర్సెస్.. - Sakshi

కేసీఆర్ వర్సెస్..

(వర్ధెల్లి వెంకటేశ్వర్లు-సంగారెడ్డి)
 
 
 మెతుకు సీమ.. ఉద్యమాల పురిటి గడ్డ... మహా మహా ఉద్దండులకు పుటిల్లు.  
 బాగారెడ్డి... ఇందిరమ్మ...
 నరేంద్ర... కేసీఆర్.. గద్దర్..
 కాపు రాజయ్యలను అందించిన నేల. మెతుకు సీమ అంటే బువ్వ పుట్టే ప్రాంతం. కానీ ఇక్కడ ఎప్పుడూ బతుకు పోరాటమే.
 ఆ ఆకలి  కేకల నుంచే పాట పుట్టింది. ... జానపదమై
 జన జాగృతి చేసింది. అలాంటి మెదక్ పార్లమెంటు స్థానంపై గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్ దళపతి బరిలో నిలబడ్డారు. పూర్వ వైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. గతంలో అతి స్వల్ప తేడాతో ఓడిపోయిన చాగండ్ల ‘ఔర్ ఏక్ దక్కా’ అంటున్నారు. తొలిసారి వైఎస్సార్ సీపీ బరిలోకి దిగుతోంది.
 
 
 మెతుకుసీమ అంటే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. తొలి విడత ఉద్యమం పునాదులు మెదక్‌లోనే ఉన్నాయి. 1971లో తెలంగాణ ప్రజాసమితి నుంచి పోటీ చేసిన మల్లిఖార్జున్ 53 వేల భారీ మెజార్టీతో గెలిచారు. మలి విడత తెలంగాణ పోరాటం ఎగిసిపడింది కూడా ఇక్కడే. సిద్దిపేట టీడీపీ ఎమ్మెల్యేగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న  కేసీఆర్  పార్టీని పదవులను వదిలేసి గులాబి జెండా ఎత్తుకున్నారు. సిద్దిపేట వేదికగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమరశంఖం పూరించారు. అప్పటికే బీజేపీతో విభేదించి తెలంగాణ సాధన సమితి పార్టీ పెట్టిన  ఆలె నరేంద్రతో దోస్తీ కట్టారు. ఆ తరువాత సాధన సమితి టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. 2004లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన నరేంద్రకు, కేసీఆర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో నరేంద్రను పార్టీ నుంచి బహిష్కరించారు. తల్లి తెలంగాణ పార్టీని పెట్టిన విజయశాంతిని చేరదీశారు. ఆ పార్టీని మెల్లగా టీఆర్‌ఎస్‌లో విలీనం చేయించారు. 2009లో అన్న కేసీఆర్ మీద అలిగి కొట్లాడి రాములమ్మ మెదక్ పార్లమెంటు సీటు తీసుకుని గెలిచారు. కాలంతో పాటు వాళ్లు మారారు.  అన్నాచెల్లెలు ఇప్పుడు విరోధులయ్యారు. మొదటి నుంచి మెదక్ పార్లమెంటు స్థానం తెలంగాణవాదులనే ఆదరించింది.  
 
 కష్టకాలంలో గడప తొక్కిన ఆడబిడ్డకు...
 
 ఇందిరమ్మ కష్టకాలంలో ఉన్నప్పుడు మెదక్ ఆదరించింది. ఎమర్జెన్సీ తరువాత ఇందిరాగాంధీకి  సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో వ్యతిరేక పవనాలు వీయగా, ఆమె 1980లో మెదక్ వలసవచ్చారు. జనతాపార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కేంద్ర మంత్రిగా ఉన్న సూదిని జైపాల్‌రెడ్డి పోటీ చేశారు. కష్టంలో గడపతొక్కి వచ్చిన ఆడబిడ్డ ఇందిరాగాంధీని మెదక్ ప్రజలు ఆదరించారు. 2.19 లక్షల అఖండ మెజార్టీ ఇచ్చి  ఢిల్లీకి  సగౌరవంగా సాగనంపారు.  మెద క్ పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఈ మెజార్టే ఇప్పటికీ రికార్డు. 1989లో పార్లమెంటులో అడుగుపెట్టిన బాగారెడ్డి వరుసగా నాలుగుసార్లు  విజయం సాధించారు.  తిరుగులేని నాయకునిగా ఆయనకు పేరుంది.
 
 కేసీఆర్ గెలిస్తే....
 
 కేసీఆర్ గెలిస్తే మళ్లీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి  ఆయన రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో  ‘ముఖ్య’మైన బాధ్యతలు తీసుకోవాలని భావిస్తున్నారు. మెదక్ పార్లమెంటుకు పోటీ చేయడం ద్వారా  ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయాలనేది కేసీఆర్ వ్యూహం. సిద్దిపేట, దుబ్బాక టీఆర్‌ఎస్‌కు పెట్టని కోటలు.  సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్, నర్సాపూర్‌లను కూడా ప్రభావితం చేసి గెలిపించుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన. పటాన్‌చెరు, నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్ ప్రభావం అంతంతమాత్రమే. ఇక్కడ కేసీఆర్ పాచికలు ఏమేరకు పారుతాయో వేచి చూడాల్సిందే.
 
 తొలిసారి రాజకీయాల్లోకి .....
 
 చివరి నిమిషంలో  డాక్టర్ శ్రావణ్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలబడ్డారు. నీళ్లు కూడా దొరకని గ్రామం నుంచి ఎదిగిన ఆయనకు డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. రాజకీయాలకు ఆయన  కొత్త. ఉద్దండులైన ఎమ్మెల్యే అభ్యర్థులు నందీశ్వర్‌గౌడ్, జగ్గారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, విజయశాంతి అండదండలు ఆయనకు ఉన్నాయి. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని శ్రావణ్ అంటున్నారు.
 
 దానధర్మాలు గట్టెక్కిస్తాయా?
 
 బీజేపీ నుంచి చాగండ్ల నరేంద్రనాథ్ బరిలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్సార్ ఆశీస్సులతో పోటీ చేసి కేవలం 6077 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విజయం అంచుదాక వచ్చిన ఆయన్ను సిద్దిపేట దెబ్బతీసింది. ఓడినా నరేన్ ట్రస్టు పేరుతో సేవలు చేస్తూ   అందుబాటులో ఉన్నారు. ఆయన చేసిన దానధర్మాలు ఎంతవరకు ఓట్లు రాలుస్తాయో చూడాల్సిందే.
 
 వైఎస్ అండతో...
 
 వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన ప్రభుగౌడ్ వైఎస్సార్ అండతో రాజకీయాల్లోకి వచ్చారు. గీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఆయన చెరకు అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. వైఎస్ సహకారంతో క్వింటాలు చెరకుకు రూ.1230 అదనపు ధర కల్పించారు. ఆయన తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచారు.
 
 బలాబలాలు..
 కేసీఆర్
 
 అనుకూలం
 కేసీఆర్‌కు ట్రబుల్ షూటర్‌గా హరీష్‌రావు  ఉండటం.
 సమస్యను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించడంలో దిట్ట.
 1970 నుంచి మెదక్  తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉండటం.
 కేసీఆర్ స్థానికుడు కావడం. ప్రజలకు ఆయనపై నమ్మకం ఉండటం
 సిద్దిపేటలో భారీ మెజార్టీ రావడం కలిసి వచ్చే అంశం’
 
 ప్రతికూలం
 
 గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి సొంత బలం,  
 పటాన్‌చెరు, నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉండటం.
 రాష్ట్రమంతా తిరగాల్సిరావటంతో గజ్వేల్ మీద దృష్టి పెట్టలేకపోవడం.
 తెలంగాణవాద ఓట్లలో కొంత భాగాన్ని కాంగ్రెస్ పార్టీ  చీల్చే అవకాశం ఉండటం  
 
 నే.. గెలిస్తే..
 మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలను మూడు జిల్లాలుగా చేస్తా
 మంజీరా నీటిని మెదక్‌కే మళ్లిస్తా.
 ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.
 సిద్దిపేట, మెదక్ రైల్వే లైన్ ఏర్పాటు చేయిస్తా.
 ప్రాణహిత- చేవెళ్ల పథకం ద్వారా గజ్వేల్, దుబ్బాక,
 సిద్దిపేట నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తా.
 సిద్ధిపేటలో  పరిశ్రమలు ఏర్పాటు చేస్తా. యువతకు ఉపాధి కల్పిస్తా.
 
 డాక్టర్ శ్రావణ్‌రెడ్డి
 
 అనుకూలం
 స్థానికుడు కావటం... ఆయన కుటుంబం దుబ్బాకలో బలహీన వర్గాలకు భూదానం చేసి ఉండటం.
 కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓటు బలంగా ఉండటం.
 సిద్దిపేట, దుబ్బాక మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ బలంగా ఉండటం.
 తమ సామాజిక వర్గం నుంచి ఒక్కరే ఉండటంతోఆఓట్లు పడే అవకాశం.
 ప్రతికూలం
 జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలకు పెద్దగా తెలియకపోవడం
 జిల్లా రాజకీయాలపై పట్టు లేకపోవడం.
 రాజకీయ అనుభవం లేకపోయినా ఉద్దండుని మీద
 పోటీ చేయాల్సి రావడం.
 అసెంబ్లీ అభ్యర్థుల మీదనే ఆధారపడటం.
 
 
 
 నే.. గెలిస్తే..
 యువతకు  ఉపాధి అవకాశాలు కల్పిస్తా.
 ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా
 తీసుకు వస్తా. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా. భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తా.
 మెదక్- అక్కన్నపేట రైల్వే లైన్ పూర్తి చేయిస్తా. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో లైన్ పొడిగించేందుకు ప్రయత్నిస్తా.
 సింగూరు,  మంజీర జలాలతో మెదక్ జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తా.
 మెదక్ చర్చి, మంజీర మొసళ్ల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తా.
 
 ప్రభుగౌడ్
 అనుకూలం
 వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు జగన్ కొనసాగిస్తాడని బలమైన నమ్మకం.
 వైఎస్ హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు.
 కేడీసీ చైర్మన్‌గా చెరుకు రైతుల గిట్టుబాటు ధర కోసం
 పోరాటం చేయడం.
 రైతు సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉండటం.
 బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి కావడం.
 
 ప్రతికూలం
 ఆర్థికంగా మిగిలిన అభ్యర్థులతో పోటీ పడలేకపోవడం.
 కొత్తగా బరిలోకి దిగడం.
 
 నే గెలిస్తే..
 ప్రాణహిత-చేవెళ్ల  ఎత్తిపోతల ప్రాజెక్టు వైఎస్సార్ స్వప్నం.  మధ్యలో నిలిచిపోయిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేసా.్త
 వైఎస్సార్ సంక్షేమ పథకాల అమలుకు కాపలాదారుడిగా ఉంటా.
 పరిశ్రమలు  ఏర్పాటు చేసి యువతకు ఉపాధి చూపిస్తా
 ప్రాజెక్టులను పూర్తిచేసి  రైతాంగానికి సాగు నీళ్లు అందిస్తా
 పేదవాడికి నిత్యం అందుబాటులో ఉంటా. మోడల్ ఎంపీగా నిలబడతా
 మెదక్ రైల్వే లైన్‌ను పూర్తి చేసి చూపిస్తా.
 
 
 నరేంద్రనాథ్
 అనుకూలం
 గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో
 ఓడిపోయిన సానుభూతి.
 ఓడిపోయినప్పటికీ నరేన్ ట్రస్టు సేవా కార్యక్రమాలతో ప్రజలకు
 అందుబాటులో ఉండటం
 బీసీ సామాజిక వర్గం ఆదరణ ఉండటం.
 
 ప్రతికూలం
 ప్రజలను ఆకట్టుకోగలిగే స్థాయిలో  ఉపన్యాసం లేకపోవడం
 గ్రామస్థాయిలో బీజేపీకి  నిర్మాణం లేకపోవడం
 ఓటరును పోలింగ్ కేంద్రం వద్ద కు తీసుకుపోగల ద్వితీయశ్రేణి
 నాయకత్వం అందుబాటులో లేకపోవడం.
 నే గెలిస్తే..


 ఆరు నెలల్లో గ్రామాలకు వాటర్ ప్లాంట్లు.
 నరేన్ ట్రస్టు నుంచి  ఉద్యోగావకాశాలు కల్పిస్తా.
 నరేన్ ట్రస్టు ద్వారా ఏటా అన్ని మతాల వారికి వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా  501 వివాహాలు చేయిస్తా.
 గ్రామ పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తా.
 మెదక్- అక్కన్న పేట రైల్వే లైన్ పూర్తి చేయిస్తా.
 నర్సాపూర్. మెదక్, దుబ్బాకలో పేదరికం ఎక్కువ.
 ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement