జేఏసీపై ఒత్తిడి తెస్తున్న కేసీఆర్
ససేమిరా అంటున్న నేతలు
హదరాబాద్: ఎన్నికల్లో మద్దతిచ్చే అంశంపై తెలంగాణ జేఏసీ తటస్థ వైఖరి తీసుకోవడంతో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నా, ఎన్నో త్యాగాలు చేసి చివరిదాకా పోరాడిన టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వకుండా ఇలా తటస్థ వైఖరి తీసుకోవడానికి కారణమైన జేఏసీ ముఖ్యులపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ కీలకమైన ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలంటూ జేఏసీ అగ్రనేతలపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డాం. 2009 తర్వాత జేఏసీ ఏర్పా టైనప్పటి నుంచి చేసిన త్యాగాలు గుర్తులేవా? విద్యార్థులను జైళ్లలో పెడితే బెయిల్స్ కోసం వెచ్చించిన కోట్ల రూపాయలు ఇంకా కోర్టుల్లోనే డిపాజిట్లుగా ఉన్నాయి. రాజీనామాలు చేయడానికి అందరూ వెనుకంజ వేసినా ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే నిలబడింది. జేఏసీకి, ఉద్యమ శక్తులకు అండగా ఉన్న ఉద్యమ పార్టీకి కీలకమైన ఈ ఎన్నికల్లో జేఏసీ మద్దతు ఎందుకు ఇవ్వదు’’ అని కేసీఆర్ జేఏసీ నేతలను ప్రశ్నించినట్టుగా తెలిసింది.
దీనికి జేఏసీ నేతలు కూడా కచ్చితంగానే తమ అభిప్రాయాన్ని చెప్పినట్టు సమాచారం. ఏదో ఒక పార్టీకి మద్దతిస్తే జేఏసీగా ఉండటంలో అర్థం లేదని వారు తెగేసి చెప్పారు. ‘‘తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ పాత్రను చిన్నగా చూడటంలేదు. అదే స్థాయిలో జేఏసీలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బీజేపీ, న్యూడెమొక్రసీని ఎలా కాదనగలం? పోరాటాలు చేసిన పార్టీతో పాటు బిల్లు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేసిన సాహసాన్ని ఎలా మరిచిపోగలం? సీమాంధ్రలో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని స్థితి ఉంది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటామని హామీ కూడా ఇచ్చాం. ఇప్పుడు దానిని మరిచిపోయి టీఆర్‌ఎస్‌కే మద్దతిస్తే నమ్మకద్రోహం కాదా? వీటన్నింటి కంటే ముఖ్యంగా ఏ ఒక్క పార్టీకి మద్దతు ఇచ్చినా జేఏసీకి గుర్తింపు, ఉనికి ఉండదు. దీనికంటే మద్దతిచ్చే పార్టీలో చేరిపోవడం మంచిది’’ అని జేఏసీ ముఖ్యనేత ఒకరు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినవారికి టికెట్లు ఇవ్వడంపైనా టీఆర్‌ఎస్ అగ్రనేతల వద్ద జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అయితే కేసీఆర్ మాత్రం తన పట్టును వీడటంలేదు. ఏదేమైనా టీఆర్‌ఎస్‌కు జేఏసీ మద్దతు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది.
బీజేపీకి దూరమేనా?
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీకి కూడా జేఏసీ దూరంగా ఉన్నట్టని నేతలు చెబుతున్నారు. టీడీపీని ఓడించాలని చెప్పడం ద్వారా బీజేపీని కూడా వ్యతిరేకిస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలని విశ్లేషిస్తున్నారు. అయితే జిల్లా స్థాయిలో టీఆర్‌ఎస్‌తో జేఏసీలకు పొసగడంలేదని తెలుస్తోంది. ఉద్యమ సందర్భంలో ఎదురైన అనుభవాలు, టీఆర్‌ఎస్ టికెట్ల పంపిణీ వంటి వాటిని జిల్లా స్థాయిలోనే జేఏసీలు వ్యతిరేకిస్తున్నాయి.
టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాల్సిందే!
Published Tue, Apr 22 2014 3:47 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement
Advertisement