సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పార్లమెంటు స్థానాల విషయంలో ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి ఇవ్వాలని, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బలరాంనాయక్‌కు మళ్లీ అవకాశం కల్పించాలని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. ఇక, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లేదంటే రాహుల్‌గాంధీ స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ఈ నిర్ణయంలో మార్పు ఉండదని, ఒకవేళ సీపీఐతో సీట్ల సర్దుబాటు లేకుంటే మాత్రం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని బరిలో దింపుతారని అంటున్నారు.
ఇక, అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి అనేక మార్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాల విషయంలో పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. పొత్తు కుదిరితే సీపీఐకి కొత్తగూడెం ఇవ్వాల్సి వస్తుందని, అలా జరిగితే వనమా వె ంకటేశ్వరరావును ఏం చేయాలన్నది ఢిల్లీ పెద్దలకు తలబొప్పి కట్టిస్తోంది. ఆయనను ఖమ్మం అసెంబ్లీకి పంపుదామనుకున్నా, యూనిస్‌సుల్తాన్, పువ్వాడ అజయ్‌లు ఆ సీటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక పొత్తులో భాగంగా పోయే మరో స్థానం పినపాకలో. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావును భద్రాచలం పంపుతారనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యవతికి మొండిచేయి చూపినట్టే. పాలేరు, మధిర, సత్తుపల్లి స్థానాలకు రాంరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్‌ల పేర్లు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీ వర్గాలంటున్నాయి. వైరా కూడా సర్దుబాటులో సీపీఐ తీసుకుంటుంది కనుక ఇల్లెందు, అశ్వారావుపేట స్థానాల్లో అభ్యర్థులను తేల్చాల్సి ఉంది. వీరందరి పేర్లను నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఖమ్మం సీపీఐకే..
Published Fri, Apr 4 2014 1:41 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement