'అమేథీ విడిచి వెళ్లమని హెచ్చరించారు'
అమేథీ: తన కుటుంబం అమేథీ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి కుమార్ విశ్వాస్ ఆరోపించారు. తన భార్య, సోదరి, ఇతర బంధువులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు తెలిపారు. అమేథీ విడిచి వెళ్లకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారని చెప్పారు. పోలీసులు తమ ఇంటికి వచ్చి మైక్లో హెచ్చరించారని వెల్లడించారు.
అలాగే తన మద్దతుదారులు కొందరిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. వారి బ్యాగులు విసిరేసి మరీ పోలీసు స్టేషన్కు లాక్కేళ్లారని తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులెవరూ ఉండకూడదంటూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుమార్ విశ్వాస్ వాపోయారు. ఈ విషయమై జిల్లా మేజిస్ట్రేట్ను అడగ్గా ఈసీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని సమాధానమిచ్చారని తెలిపారు. అమేథీలో రాహుల్ గాంధీపై విశ్వాస్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు.