జనసంద్రం
ఊరు ఏదైనా అదే అభిమానం.. ‘అనంత’ ఆప్యాయత. అవ్వలూ.. తాతలూ.. తమ్ముళ్లూ.. అక్కలూ.. అన్నలూ.. స్నేహితులూ అంటూ జననేత నోటి నుంచి ఒక్కో మాట వెలువడుతుంటే అంబరమంటేలా జనతరంగం కేరింతలు.. పోటెత్తిన జనప్రవాహం తమ అభిమాన నేత, ఆత్మబంధువును అక్కున చేర్చుకుని ఘన స్వాగతం పలికింది. మండుటెండను సైతం లెక్కచేయక కనుచూపు మేర రోడ్డు కిరువైపులా బారులు తీరిన జనం చిక్కటి చిరునవ్వుతో ఆత్మీయ నేతకు అండగా ఉంటామంటూ నినదించారు. ‘వైఎస్‌ఆర్ జనభేరి’లో భాగంగా సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మడకశిర, హిందూపురంలో పర్యటించారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో ఉప్పొంగిన హిందూపురంలో.. మీ ఓటుతో సువర్ణ యుగానికి నాంది పలకండంటూ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.
సాక్షి, అనంతపురం : జనం ఉప్పెనలా కదిలారు. అనుకున్న సమయానికి జననేత చేరుకోకపోయినా ఆయన కోసం ఆతృతగా ఎదురు చూశారు. గంటల తరబడి ఎండను లెక్కచేయలేదు. ఆకలి దప్పిక మరచి రాజన్న తనయుడికి ఆత్మీయ స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మడకశిర, హిందూపురానికి రావడంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఫుల్‌జోష్ కనిపించింది. మడకశిరలో మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఏ మాత్రం లెక్క చేయకుండా జగన్ రాక కోసం జనం వేచి చూశారు. వీధులన్నీ జనమయమయ్యాయి.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విశ్వసనీయతకు కట్టుబడి వుండే నాయకున్నే ఎన్నుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరినప్పుడు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలన్నీ తిరిగి అమలు కావాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలంటూ జనం ఆకాంక్షించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరి హిందూపురం సభకు హాజరు కావాల్సి వుండగా సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ ఆగిపోవడంతో రోడ్డు మార్గం గుండా వచ్చారు. అప్పటికే మూడు నాలుగు గంటల పాటు వేచి చూచిన అభిమానులు ఆయన రాక కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా తీవ్రమైన ఎండలోనే వుండిపోయారు. ప్రచారం ముగిసే సమయానికి 20 నిమిషాల ముందు జగన్‌మోహన్‌రెడ్డి హిందూపురం చేరుకుకునే సరికి పట్టణంలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. ‘‘కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నా ఈ ప్రాంతానికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేక పోయారు.
వైఎస్ హయాంలో దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు చేసి పీఏబీఆర్ డ్యాం నుంచి తాగునీటిని తీసుకొచ్చి హిందూపురం పట్టణ ప్రజల దాహార్తి తీర్చారు’’ అని వైఎస్ జగన్ గుర్తు చేసినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కన్పించింది. నెరవేర్చలేని హామీలు ఇస్తున్న చంద్రబాబును నమ్మొద్దని ఇప్పుడిస్తున్న హామీలను ఆయన హయాంలో ఎందుకు అమలు చేయలేకపోయారో ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలక్రిష్ణ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు నిలదీయండని జగన్ పిలుపునివ్వడంతో జనమంతా కరతాళ ధ్వనులు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రచార సమయం ముగియడంతో హిందూపురం నుంచి తాడిపత్రికి వెళ్లలేకపోయారు. అప్పటికే తాడిపత్రిలో జగన్ రాక కోసం వేలాది మంది సాయంత్రం 7 గంటల వరకు వేచి చూశారు. ఆయన పర్యటన రద్దు అయ్యిందని తెలిసి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు జగన్‌ను చూడకుండానే వెనుదిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెలికాప్టర్ మొరాయించడం వల్ల ఆయన రాలేకపోయారని తెలుసుకుని.. ‘ఆయన రాకపోయినా ఫరవాలేదు.. ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. మొత్తానికి చివరి రోజు వైఎస్ జగన్ పర్యటనతో పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
తాడిపత్రిలో పోటెత్తిన జనం
జేసీ సోదరుల రాజకీయ కంచుకోటగా భావించే తాడిపత్రిలో జగన్ కోసం జనం పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే జనం రోడ్లపైకి వచ్చి.. ఈలలు.. కేకలు.. నృత్యాలు చేస్తూ.. ప్రచారం హోరెత్తించారు. ఒట్టి పోయిన పెన్నా నదిలో నదీప్రవాహం కనిపిస్తే ఎలా పరవశించి పోతారో అంతకన్నా ఎక్కువగా ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాజన్న తనయుడు జగనన్న వస్తున్నాడని తెలుసుకునిసంబరపడిపోయారు. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా తమ అభిమాన నేత తాడిపత్రికి రాలేకపోయారన్న వార్త అందుకున్న జనం ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జననేత పంపిన సందేశాన్ని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనంత వెంకట్రామిరెడ్డి, వీఆర్‌రామిరెడ్డిల ద్వారా విని సంతోషించారు. జగనన్న రాకపోయినా పర్వాలేదు.. ఆయన పంపిన సందేశమే మాకు శిరోధార్యం అంటూ నినదించారు. అయితే జగన్ రాకపోయినా ఆయన కోసం తరలివచ్చిన జనసంద్రాని చూసిన జేసీ సోదరులకు కళ్లు బైర్లు కమ్మి..దిమ్మదిరిగి..మైండ్ బ్లాంక్ అయిపోయినట్లయింది. ఇన్నాళ్లు గెలుపుపై ధీమాతో ఉన్న జేసీ సోదరులు ఇప్పుడు జగన్ సభకు తరలివచ్చిన జనాన్ని చూసి ఇప్పుడేం చేయాలబ్బా..అంటూ తలలు పట్టుకోవాల్సి వచ్చింది.
సభల్లో ఆకట్టుకున్న జగన్ ప్రసంగం
‘‘రాజకీయమంటే ప్రతి పేదవాడి మనసెరగడం.. రాజకీయమంటే చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం ఆరాటపడటం.. ఇది నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నిజంగా నాన్న ప్రతి పేదవాడి గురించి అంతగానే పట్టించుకునే వారు. కులం..మతం..ప్రాంతం ఏమీ పట్టించుకోలేదు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి పేదవారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు’’ అంటూ జగన్ వైఎస్సార్ పేరు ప్రస్తావించినపుడల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మీ చల్లని దీవెనలు కావాలి.. ఎలాంటి నాయకత్వానికి ఓటు వేస్తున్నామని మీరే ప్రశ్నించుకోండి అంటూ జగన్ అనగానే మా ఓటు ఫ్యాన్‌గుర్తుకే, కాబోయే సీఎం మీరే అంటూ జనం పెద్ద ఎత్తున స్పందించారు. విశ్వనీయత, విలువలకు పట్టం కట్టేలా జగన్ చేసిన ప్రసంగం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చి ధీమా కల్పించింది.
అవ్వా ఫ్యాన్.. అక్కా ఫ్యాన్
జగన్ ఆయా సభల్లో ప్రసంగాల్లో చివర్లో ‘మనది కొత్తపార్టీ.. అందరికీ మన పార్టీ గుర్తు తెలిసి ఉందో లేదో.. మన పార్టీ గుర్తు తెలిసిన వాళ్లు చేతులు ఎత్తండి’’ అని అనగానే సభికులు అందరూ ఒక్కసారిగా చేతులు పెకైత్తారు. స్పందించిన జగన్ గుర్తు తెలిసిన వారు తెలియని వారికి చెప్పాలని సూచించారు. అవ్వా ఫ్యాన్.. అక్కా ఫ్యాన్.. తమ్ముడూ ఫ్యాన్.. తాతా ఫ్యాన్ అంటూ సీలింగ్ ఫ్యాన్‌ను తిప్పుతూ జగన్ చూపడంతో ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అంటూ సభికులు నినాదాలతో హోరెత్తించారు.