బీజేపీ భీష్ముడి మనసు మారిందా?
బీజేపీ భీష్ముడు అద్వానీ ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. తప్పనిసరి అని ఎవరైనా అన్నారో, ఇక తప్పదు అని ఆయనే అనుకున్నారో గానీ.. పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ మీద ప్రశంసల వర్షం కురిపించారు. బహిరంగ సభా వేదికపై.. 'మార్పు కావాలంటే మోడీకి ఓటేయండి' అంటూ పిలుపునిచ్చారు. ఓట్ ఫర్ ఛేంజ్.. ఓట్ ఫర్ మోడీ అని తన నోటితోనే అన్నారు. గాంధీనగర్ వద్దు.. ఈసారి భోపాల్ నుంచి పోటీ చేస్తానని చెప్పి, భంగపాటుకు గురై చివరకు గాంధీనగర్ బరిలోనే దిగిన తర్వాత మొట్టమొదటిసారి పార్టీ తరఫున ప్రచార పర్వంలోకి దిగారు. మహారాష్ట్రలోని శివగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ.. మొట్టమొదటి సారిగా నరేంద్ర మోడీ మీద ప్రశంసలు కురిపించారు.
'ప్రస్తుతం మన దేశానికి కావల్సింది కేవలం నినాదాలు ఇచ్చే నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం మోడీకి ఓటేయండి' అని అద్వానీ చెప్పారు. అభివృద్ధి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయడం ద్వారా గుజరాత్ స్వరూపాన్ని మోడీ పూర్తిగా మార్చేశారని ఆయన ఓటర్లకు తెలిపారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ అత్యంత బలహీన ప్రధాని అని పేర్కొన్నారు.
ఎర్రకృష్ణుడి మనసెందుకు మారిందో ఎవరికీ తెలియలేదు. పార్టీ ప్రచారకమిటీ అధ్యక్షుడిగానే మోడీని అంగీకరించని అద్వానీ.. చివరకు బలవంతంగానైనా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మోడీ గురించి సానుకూలంగా మాట్లాడని అద్వానీ, ఈసారి మాత్రం ఎందుకోగానీ మనసు మార్చుకుని ప్రశంసలు కురిపించారు. దీనివెనక ఎవరి బలవంతం ఉందో, ఎవరేం చెప్పారోనని జనం చెవులు కొరుక్కుంటున్నారు.