ఎమర్జెన్సీలో కొత్త రాజకీయాల జన్మ
అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల కిందట దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి మన ప్రజాస్వామ్యానికి తగిలిన అతిపెద్ద దెబ్బ అని ప్రధానిమోదీ అభివర్ణించారు. దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కొత్త తరహా రాజకీయాలకు జన్మనిచ్చిందని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ అత్యవసర పరిస్థితి జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలని పేర్కొన్నారు. లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్ 113వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీలో ‘లోక్‌తంత్ర ప్రహారి అభినందన్’ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. అణచివేతపై పోరాడే స్ఫూర్తి.. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి వచ్చిన అతిపెద్ద సందేశమని చెప్పారు.
ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న చాలా మంది నాయకుల తొలి రోజులు ఎమర్జెన్సీ రోజుల్లోనే ఉన్నాయని, వారు కొత్త తరహా రాజకీయాలకు జన్మనిచ్చారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని ఎవరినో విమర్శించటానికి గుర్తుంచుకోరాదని.. ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛకు కట్టుబాటును నిరంతరం మననం చేసుకోవటానికి గుర్తుంచుకోవాన్నారు. ఇందుకోసం దేశంలోని మీడియా ఎప్పుడూ అత్యయిక స్థతి రోజులను మరవనీయకూడదని.. ప్రతీసారి గుర్తు చేయాలని సూచించారు.
జేపీ ఆలోచనా విధానాలు, సిద్ధాంతాలను చరితార్ధం చేయడానికి రాజకీయమార్గాన్ని వీడి గోండా వెళ్లి జైప్రభ నాగర్‌ను ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేశారంటూ నానాజీ దేశ్‌ముఖ్‌ను ఈ సందర్భంగా మోదీ స్మరించారు. బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ, అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్‌బాదల్ సహా 1975-76లో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకు వెళ్లిన పలువురు నాయకులు కళ్యాణ్‌సింగ్, కోహ్లీ, బలరాంజీదాస్ టండన్, వజుబాయ్‌వాలా, కరియా ముండా, వి.కె. మల్హోత్రా, జయంతిబెన్ మెహతా, విరేంద్ర కపూర్, సుబ్రమణ్యం స్వామి, విక్రం రావు, రాంజీసింగ్, కామేశ్వర్ పాశ్వాన్, ఆరీఫ్ బేగ్‌లను ఈ సందర్భంగా మోదీ సన్మానించారు.