‘అక్కా ఈ సారి బాలయ్య పోటీ చేస్తున్నాడు. మీ అమూల్యమైన ఓటును టీడీపీకి వేసి ఆదరించండి’ ఇదీ హిందూపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రచారం తీరు.
‘ఏమప్పా.. ఇన్నాళ్ల నుంచి ఆ పార్టీకే ఓటేసినాం. ఏం చేసినారయ్యా.. మంచి నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వత్తాంది.. అయినా ఇప్పుడు బాలకృష్ణను గెలిపిస్తే, రేపు మాకేదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవల్ల. ఆయప్ప ఏమన్న ఈడుంటాడా?’ - ఇది ప్రజల నుంచి ఎదురౌతున్న ప్రశ్న.
‘మేమున్నాం కదక్కా.. మీ సమస్యలుంటే మాకు చెప్పుకోండి.. మేం తీర్చేస్తాం’ - టీడీపీ నేతల సమాధానం
‘బాగ చెప్పినారు పోప్పా.. బాలకృష్ణ దగ్గరికి పోయేకి మీకే దిక్కులేదు. మా సమస్యలు తీరుస్తారంట. ఇప్పటికే సాలా తప్పు చేసినాం. ఈ సారి అలా చేయం.. పోండి..పోండి’ - జనం మాట
సాక్షి, అనంతపురం : హిందూపురం బరి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగిన బాలయ్యకు ‘స్థానిక’ సెగ తగులుతోంది. ఆయన స్థానికేతరుడు కావడంతో ప్రచారానికి వెళ్తున్న టీడీపీ నేతలకు చుక్కెదురవుతోంది. బాలకృష్ణను గెలిపించాలని నేతలు కోరుతుంటే.. జనం మాత్రం అందుకు భిన్నంగా ప్రతిస్పందిస్తున్నారు. తమకు సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌కు వెళ్లి ఆయనతో చెప్పుకోవాలా? అని ప్రశ్నిస్తుండడంతో ఏం చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ
ప్రజలు నందమూరి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా ఉన్న నేతకే పట్టం కడతామని తెగేసి చెబుతున్నారు. నామినేషన్ ముగిసిన తర్వాత రెండ్రోజుల పాటు ప్రచారం చేసిన బాలయ్య.. ఇతర జిల్లాల్లో ప్రచారం కోసమని వెళ్లిపోయారు. దీంతో ప్రచార బాధ్యతల్ని స్థానిక నేతలు తీసుకోవాల్సి వచ్చింది. గ్రామాల్లోకి వెళ్తున్న నేతలను ప్రజలు నిలదీస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రధానంగా హిందూపురం పట్టణంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. సమస్యలు తీర్చేందుకు తామున్నామంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, అంబికా లక్ష్మినారాయణ హామీ ఇస్తున్నా వారి మాటల్ని మాత్రం జనం నమ్మడం లేదు. ‘ప్రచారంలో మిమ్మల్నే దగ్గరకు రానీని బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా గెలిస్తే మిమ్మల్ని పట్టించుకుంటాడా? మా సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ధైర్యం మీకుందా?’ అని నిలదీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి స్థానికేతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టం కట్టమని ప్రజలు తెగేసి చెబుతుండటంతో టీడీపీ నేతలు ఏం చేయాలో తెలీని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బాలయ్య అఫిడవిట్‌లో హైదరాబాద్ చిరునామా పేర్కొనడంతో ఆయన్ను తెలంగాణ వ్యక్తిగానే జనం భావిస్తున్నట్లు విశదమవుతోంది.
మెజార్టీపై ‘స్థానిక’ దెబ్బ!
హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే ఉన్నా గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఆ పార్టీకి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. మొదట్లో 50 వేల పైచిలుకు మెజార్టీ సాధించినా 1999 ఎన్నికల్లో సీసీ వెంకట్రాముడు 38,391 ఓట్ల మెజార్టీ సాధించారు. 2004లో పి.రంగనాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ నిశ్చల్‌పై కేవలం 7363 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన నవీన్ నిశ్చల్‌పై అబ్దుల్ ఘని 8754 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
దీన్ని బట్టి ఈ రెండు ఎన్నికల్లో కూడా స్థానికులకే పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వచ్చిందని స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల మెజార్టీని భారీగా తగ్గించిన నవీన్ నిశ్చల్.. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రచార పర్వంలో తమకు ఎదురవుతున్న ఘటనలను తలుచుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ ఎన్నికల్లో బాలయ్య గెలుపుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్యకు ‘స్థానిక’ సెగ
Published Mon, Apr 21 2014 3:35 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement