
రుణపడి ఉంటా: బాలకృష్ణ
తన తండ్రిని ఆదరించినట్టుగానే తననూ ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
సాక్షి, అనంతపురం: తన తండ్రిని ఆదరించినట్టుగానే తననూ ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకముంచి విజయాన్నందించిన హిందూపురం ప్రజలకు ఏమి చేస్తే రుణం తీరుతుందో అర్థం కావట్లేదన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌కన్నా ఎక్కువగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
ముందుగా ఒక కమిటీని ఏర్పాటుచేసి నియోజకవర్గంలోని సమస్యలను గుర్తిస్తానని, తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఐదేళ్లలో హిందూపురాన్ని సమస్యల్లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. తాను గెలవడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ విజయదుందుభి మోగించడం సంతోషదాయకమన్నారు. ఈ విజయాన్ని చూస్తే తన తండ్రి నాటి రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. మంత్రి పదవిపై ఇంకా ఆలోచించుకోలేదని, అదంతా పార్టీ అధినాయకుడు చూసుకుంటారని ఓ ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు.