బీజేపీలోకి మన్మోహన్ తమ్ముడు
ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన పార్టీ కాంగ్రెస్.. ఏ మాత్రం జీర్జించుకోలేని ఉదంతమిది. మన్మోహన్ సవతి తమ్ముడు దల్జీత్ సింగ్ కోహ్లి బీజేపీలో చేరిపోయారు. అదీ ఆయనను నిత్యం కీలుబొమ్మంటూ విమర్శిస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో..! అమృతసర్లో వ్యాపారి అయిన దల్జీత్ ఎన్నికల ప్రచార సభలో మోడీ, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌ల సమక్షంలో కమలదళ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలపడుతుందని మోడీ చెప్పారు. ‘ఈరోజు ప్రధాని మన్మోహ న్ సింగ్ సోదరుడు దల్జీత్ సింగ్ బీజేపీలో చేరారు. ఇది మమ్మల్ని బలోపేతం చేస్తుంది. మాది సభ్యత్వాల గురించి చెప్పుకునే పార్టీ కాదు, సంబంధాలను నెలకొల్పుకునే పార్టీ’ అని మోడీ అన్నారు. దల్జీత్‌కు బాదల్, అమృత్‌సర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి అరుణ్ జైట్లీ స్వాగతం పలికారు.
మన్మోహన్ కుటుంబం దిగ్భ్రాంతి
దల్జీత్ బీజేపీలో చేరడం మన్మోహన్ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) వర్గాలు చెప్పాయి. దల్జీత్ ఉద్దేశాలేంటో తమకు తెలియవని, ఆయనకు, ప్రధానికి మధ్య చాలా కాలంగా సంబంధాలు లేవన్నాయి. ‘మన్మోహన్ తల్లికి ఆయనొక్కడే కొడుకు. ఆయనకు ఆరుగురు అక్కచెల్లెళ్లు. దల్జీత్సింగ్ ప్రధానికి సవతి తమ్ముడు. మన్మోహన్ తల్లి చిన్న వయసులోనే చనిపోయింది’ అని తెలిపాయి.