మోడీ నరహంతకుడు
- బీజేపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృత్తం
- వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్‌కు ఓటెయ్యండి
- రోడ్ షోలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మదనపల్లె, మదనపల్లె రూరల్ న్యూస్‌లైన్ : ‘‘నరహంతకుడు నరేంద్ర మోడి. బీజేపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృత్తమవుతాయి. మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటెయ్యండి’’ అని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు నిచ్చారు.
మదనపల్లె రూరల్ మండలంలోని కాశీరావుపేట, సీటీఎం, గుడిసివారిపల్లె, పోతపోలు, బాలాజీనగర్, అంకిశెట్టిపల్లె, చిప్పిలి, అంకిశెట్టిపల్లె, వలసపల్లె, వేంపల్లె, చీకలబైలు, బండకిందపల్లె తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఆయన మదనపల్లె అభ్యర్థి దేశాయ్‌తిప్పారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. మొదటగా కాశీరావుపేటకు చేరుకున్న పెద్దిరెడ్డికి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి సీటీఎం, గుడిసివారిపల్లె, పోతపోలులో జరిగిన సభల్లో ప్రసంగించారు.
మైనారిటీలను ఊచకోత కోసిన బీజేపీ నాయకుడు నరేంద్రమోడి నరహంతకుడన్నారు. పార్లమెంటు సభ్యులు ఉన్న ఇంటికి నిప్పంటించి 11 మంది సజీవదహనానికి కారకుడయ్యాడని ధ్వజమెత్తారు. ప్రజలు బీజేపీకి ఓట్లువేస్తే 2002లో జరిగిన గోద్రా ఘటనలు సీమాంధ్ర, మదనపల్లెల్లో పునరావృత్తమవుతాయన్నారు.
బీజేపీతో రాక్షస పాలన కావాలో వైఎస్‌ఆర్ సీపీతో సువర్ణపాలన కావాలో ప్రజ లే తేల్చుకోవాలని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ల పాటు సీమాంధ్రలో సువర్ణపాలన అందిస్తారని భరో సా ఇచ్చారు. ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
చంద్రబాబునాయు డు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర కరువుతో అల్లాడాల్సి వచ్చిందన్నారు. అప్పటి తెలుదేశం పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయా..? మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందాయో ఒకసారి ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు, మహిళలు, మైనారిటీలు, రైతుల సంక్షమానికి వైఎస్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు.
సమైక్య రాష్ట్రానికి ఆమె ఒరగబెట్టిందేమీ లేదు
‘‘బీజేపీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పురందేశ్వరి ఇంతకాలం ఎక్కడున్నారు?. కేంద్ర మంత్రిగా ఉండి సమైక్య రాష్ట్రానికి ఆమె ఏం ఒరగబెట్టారు?. రాష్ట్రం విడిపోకుండా ఉండేం దుకు మంత్రి పదవికి రాజీమానా చేయాలని కోట్లాది గొంతులు నినదించినా పట్టించుకోలేదు.. మాట వరసకైనా రాజీనామా చేస్తామని చెప్పలేదు.. ఇప్పుడు ఐదు జిల్లాలు దాటి అధికార వాంఛతో ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ మదనపల్లె అభ్యర్థి దేశాయ్‌తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడుపై వారు నిప్పులు చెరిగారు. బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివస్రాద్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు.