మొరాకో | Morocco is the world's view | Sakshi
Sakshi News home page

మొరాకో

Published Sat, Jan 31 2015 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

మొరాకో

మొరాకో

ప్రపంచవీక్షణం
 
 
నైసర్గిక స్వరూపం
వైశాల్యం:  4,46,500 చదరపు కిలోమీటర్లు
జనాభా: 3,32,50,000 (తాజా అంచనాల ప్రకారం)
 
రాజధాని: రబత్  ప్రభుత్వం: యూనిటరీ రిపబ్లిక్ కాన్‌స్టిట్యూషనల్ మొనార్చీ  కరెన్సీ:  దిర్హమ్  భాషలు: అరబ్బీ అధికార భాష, బెర్బర్, ఫ్రెంచి, స్పానిష్ ఇతర భాషలు  మతము: 99% ముస్లిములు, 1% క్రైస్తవులు  వాతావరణం : జనవరిలో 8-17 డిగ్రీలు, ఆగస్ట్‌లో 18-20 డిగ్రీలు  పంటలు : గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పప్పులు, నిమ్మ, కూరగాయలు, ఆలివ్, ద్రాక్ష.  పరిశ్రమలు: ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు, తోలు వస్తువులు, సిమెంట్, సారాయి, ఎరువులు, గనులు, ఫాస్ఫెట్, ఇనుము, సీసము ముడి పదార్థాలు.   సరిహద్దులు: అల్జీరియా, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం.
 
 
పరిపాలనా రీతులు: పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 16 రీజియన్లుగా విభజించారు. ఈ రీజియన్లను తిరిగి 62 ప్రావిన్స్‌లు లేదా ప్రిఫెక్చర్‌లుగా విభజించారు. దేశంలో కాసాబ్లాంకా, బబత్-సాలె, ఫెస్, మారకేశ్, టాంజియర్, మెక్నెస్, అదాగిర్, అవుజ్దా, కెనిట్రా, టెటోవాన్, అస్ఫి, మొహమ్మదియా, బేని మెల్లాల్, ఖౌరిబ్గా, ఎల్‌జదిదా, తాజా, నాదోర్, సెట్టాట్, బెర్రెచిడ్, లరాచ్చెలు పెద్ద నగరాలు. వీటిలో కాసాబ్లాంకా, రబత్ సాలెలు అతి పెద్ద నగరాలు.
 
చరిత్ర: 8వ శతాబ్దంలో బెర్బర్ రాజులు మొరాకో నుండి పక్కనే ఉన్న స్పెయిన్ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేశారు. వీరికంటే ముందు మొరాకో దే శాన్ని రోమ్, వండాల్ రాజులు పాలించారు. క్రీ.శ. 685లో అరబ్బులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి మొరాకోను ముస్లిం దేశంగా మార్చేశారు. 11వ శతాబ్దంలో బెర్బర్ రాజులు ముస్లిం రాజులను పారద్రోలి తమ సామ్రాజ్యాన్ని స్పెయిన్, సెనెగల్ దాకా విస్తరించారు. అరబ్బులకు, బెర్బర్‌లకు ఎప్పుడూ ప్రచ్ఛన్న యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ తరువాత స్పెయిన్, పోర్చుగల్ అధికారంలో ఉన్న క్రిస్టియన్ పాలకులు క్రమంగా మొరాకోలోని మూరిష్ పాలకులను విడదీసి మొరాకో దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 15వ శతాబ్దంలో తిరిగి మూరిష్ రాజులు మొరాకోపై తమ ఆధిపత్యం కొనసాగించారు. మూడు వందల సంవత్సరాల తరువాత 19వ శతాబ్దంలో ఫ్రెంచి రాజులు మొరాకో చర్చిల్, రూజ్‌వెల్ట్, డిగాలేల చర్చల ఫలితంగా 1956లో మొరాకో స్వతంత్ర దేశంగా మారింది. అయితే క్యూటా, మెలిల్లా అనే రెండు చిన్న పట్టణాలు మాత్రం ఇప్పటికీ స్పెయిన్ ఆధీనంలో ఉన్నాయి.

దేశంలో చూడదగిన  ప్రదేశాలు

 
రబత్ నగరం
 
ఈ నగరం కూడా అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉంది. ఈ నగరానికి ఆనుకుని తెమారా, సాలె అనే నగరాలు ఉన్నాయి. ఈ మూడు నగరాలు కలిసిపోయి ఉన్నాయి.  క్రీ.శ. 11వ శతాబ్దంలోనే ఈ నగరం నిర్మింపబడింది. 1912లో ఫ్రెంచి రాజులు దీనిని ఆక్రమించుకున్నారు. నగరం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది - పాత నగరం. దీనిని మదీనా అంటారు. రెండవది ఔదాయాస్, మూడోది హసన్. నగరంలో మహమ్మద్ - 5 రాజభవనం, యూనివర్సిటీ, హసన్ టవర్, చిల్లా నెక్రో పోలిస్, ఉదాయాస్ కజ్జా, పురావస్తు మ్యూజియం, సూసీ స్టేజి, సెయింట పియరీ కాథడ్రల్, పార్లమెంట్ భవనం, దల్-అల్-మఖ్‌జన్, బేరెగ్రెగ్ లు చూడ దగిన స్థలాలు.  
 
 కారకల్లా ఆర్చ్

 
ఇది ఒకప్పటి రోమన్ల నగరం. మూడవ శతాబ్దానికి పూర్వం రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పుడు నిర్మించిన ఒక ఆర్చి ఇప్పటికీ నిలిచి ఉంది. ఈ ప్రాంతమంతా ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయి. వివిధ ధాన్యాలు, ఆలివ్ పండుతాయి. వోలు బిల్లిస్ రోమన్ల పరిపాలన సమయంలో ఎంతో గొప్పగా ఉండేది. ప్రస్తుతం శిథిలాలు మాత్రం మిగిలాయి. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది. రోమన్లు దాదాపు 700 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. 8వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఇద్రిస్ ఇబ్బన్ అబ్దుల్లా అనే రాజు ఆక్రమించుకున్నారు. 18వ శతాబ్దంలో వచ్చిన పెద్ద భూకంపం కారణంగా ఈ ప్రాంతంలోని భవనాలన్నీ కూలిపోయాయి. అలా కూలి పోయినవి ఈనాటికీ అలాగే ఉన్నాయి.
 
కాసాబ్లాంకా
 
మొరాకో దేశంలో అతిపెద్ద నగరం కాసాబ్లాంకా అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో ఉంది. నాలుగు మిలియన్ల పైగా జనాభా ఉంది. ప్రసిద్ధ ఓడరేవులు, విమానాశ్రయాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో బెర్బర్‌లు ఈ పట్టణాన్ని నిర్మించారు. తరువాత కాలంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 14వ శతాబ్దం నుండి ఈ నగరం ఒక ప్రముఖ ఓడరేవుగా ప్రపంచంలో గుర్తించబడింది. 15వ శతాబ్దంలో ఈ నగరాన్ని పోర్చుగీసువాళ్లు ఆక్రమించుకున్నారు. పోర్చుగీసులో కాసా బ్లాంకా అంటే శ్వేత భవనం అని అర్థం. క్రీ.శ. 1755లో వచ్చిన భయంకర భూకంపంలో ఈ పట్టణం 75% కూలిపోయింది. 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ పట్టణాన్ని సుల్తాన్ మహమ్మద్ చిన్ అబ్దుల్లా తిరిగి నిర్మించాడు. 1930 నుండి ఈ నగరం బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు మొరాకో దేశంలో ఈ నగరమే గొప్ప వ్యాపార కేంద్రం. ఈ నగర పరిసరాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి. దేశ ఆదాయంలో 50% ఆదాయం ఈ నగరం నుండే వస్తుంది.
 నగరంలో హసన్-2  మసీదు ఒక గొప్ప ఆకర్షణ. ఫ్రెంచి దేశపు శిల్పి మిచెల్ పిన్‌సావు ఈ కట్టడానికి రూపకల్పన చేశాడు. నగరంలో ఇంకా కాసాబ్లాంకా కాథడ్రల్, కాసాబ్లాంకా ట్విన్ సెంటర్.
 
చెఫ్ చావెన్

 
ఇది దేశంలో ఉత్తర-తూర్పు భాగంలో ఉంది. ఇదొక ప్రత్యేకమైన నగరం. ఈ నగరం రిఫ్ట్ పర్వతాల పాదాల మీద ఈ నగరం నిర్మించబడింది. ఇళ్లన్నీ ఎంతో ఇరుకుగా కనిపిస్తాయి. దూరం నుండి చూస్తే ఇళ్లనీ ఒకదాన్ని ఒకటి అతుక్కొన్నట్లుగా కనిపిస్తాయి. ప్రతి ఇంటి గోడలు సున్నం వేయబడి తెల్లగా ఉంటాయి. పై కప్పులు ఎర్రటి పెంకులతో ఉంటాయి. ఈ నగరం హస్తకళల వస్తువులకు ప్రసిద్ధి. ఈ వస్తువులు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా దొరకవు. ఊలు, ఉన్ని దుస్తులు, బ్లాంకెట్లకు ఈ నగరం ప్రసిద్ధి. ఈ నగరానికి ఉన్న మరో ప్రత్యేకత మేకపాల వెన్న!  ఇది కూడా దేశంలో మరెక్కడా దొరకదు. హషిష్ అనే మత్తు పదార్థం ఈ నగరంలో విస్త ృతంగా లభిస్తుంది.
 
 
మొరాకో ఇసుక తిన్నెలు

 
 మొరాకో దేశ దక్షిణ భాగం చివరిలో సహారా ఎడారి ఆనుకొని ఉంది. ఈ ఎడారిలో ఇసుక తిన్నెలను చూడడానికి పర్యాటకులు లక్షలాదిగా వస్తారు. ఎర్గ్ చెబ్బి ఇసుక తిన్నెలు బాగా ప్రసిద్ధి. ఒంటెల మీద ప్రయాణం గొప్ప అనుభూతిని స్త్తుంది. ఈ ఎర్గ్ చెబ్బి ఇసుక తిన్నెలు చాలా విశాలమైనవి. ఈ ఎడారిలో ఒక చిన్న నగరం ఉంది. దాని పేరు మెర్జోగా. చాలా మంది పర్యాటకులు ఈ ఎడారిలో గుడారాలు వేసుకొని ఉండి ఆనందిస్తారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ ఎడారిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగేచలికాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి.ఎడారిలో ఒయాసిస్సులు కూడా ఉన్నాయి. దాయత్ శ్రీజ అనే ఉప్పు నీటి సరస్సు కూడా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement