
రాజకీయ తెరపై సినీ‘బొమ్మ’లు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెండితెర వేల్పుల రాజకీయ ‘తెర’ంగేట్రం ఊపందుకుంది. ఇప్పటికే శతృఘ్నసిన్హా, రాజ్‌బబ్బర్, హేమామాలిని వంటి పాతతరం తారలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవగా.. కొత్తగా అనేకమంది ఎన్నికల రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరిలో కిరణ్ ఖేర్, గుల్ పనగ్, మూన్‌మూన్ సేన్ వంటివారు అనేకమంది ఉన్నారు.
మరోవైపు తెలుగు సినీహీరో పవన్ కల్యాణ్ ‘జనసేన’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. సినిమా తారలు రాజకీయ రంగంలోకి దూకడం ఇదే ప్రథమం కాదు. గతంనుంచీ కొనసాగుతున్నదే. అయితే రాజకీయరంగ ప్రవేశం చేసిన తారల్లో విజయవంతమైనవారి సంఖ్య దక్షిణాదితో పోలిస్తే.. ఉత్తరాదిన చాలా తక్కువ. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంజీ రామచంద్రన్, ఎన్టీ రామారావు వంటివారు తమ హవా కొనసాగించి.. అధికారపీఠాన్ని అందుకున్నారు.
అదేసమయంలో ఉత్తరాదిలో అమితాబ్ బచ్చన్, రాజేష్‌ఖన్నా, ధర్మేంద్ర, గోవిందా వంటి సినీ స్టార్లు ఎంత ఉత్సాహంతో రాజకీయ ప్రవేశం చేశారో.. అంతే వేగంగా వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల రాజకీయాల్లోకి వస్తున్నవారిలో ఎందరు సత్తా చాటగలరు.. ఎంతవరకు నిలబడగలరనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో గుల్ పనగ్ ఒకరు. చండీగఢ్ నుంచి ఆప్ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు బీజేపీ.. నటి కిరణ్ ఖేర్‌ని రంగంలోకి దింపింది. దీంతో ఛండీగఢ్‌లో పోటీ రసవత్తరంగా మారింది. పలు ఆరోపణలవల్ల రైల్వే మంత్రి పదవి నుంచి తప్పుకున్న పవన్‌కుమార్ బన్సల్ ఇక్కడ్నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు సినీ తారల మధ్య ఆయన కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సినీతారల గ్లామర్‌పై ఆశలు పెట్టుకుంది. అందుకే పలు రాష్ట్రాల్లో సినీతారలను రంగంలోకి దింపుతోంది. భోజ్‌పురి సూపర్‌స్టార్ రవికిషన్ (జాన్‌పూర్), నటి నగ్మా (మీరట్), నాటితరం బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ (ఘజియాబాద్) వంటివారు ఇందులో ఉన్నారు.
బీజేపీ కూడా సినీగ్లామర్‌కు ఓట్లు రాలతాయని ఆశిస్తూ.. పలువురు నటులను రంగంలోకి దింపుతోంది. వీరిలో శతృఘ్నసిన్హా(పాట్నాసాహిబ్), హేమామాలిని (మథుర) వంటి పాతకాపులున్నారు. ఇంకా పరేష్ రావల్(అహ్మదాబాద్ తూర్పు), జోయ్ బెనర్జీ(బిర్భుం), బబుల్ సుప్రియో(అసన్‌సోల్) వంటివారినీ దింపుతోంది.
తృణమూల్ కాంగ్రెస్‌సైతం ఈ విషయంలో ముందంజలో ఉంది. ఈ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నవారిలో మూన్‌మూన్ సేన్(బంకుర), సంధ్యాసేన్(మిడ్నపూర్), విశ్వజిత్(న్యూఢిల్లీ), సూపర్‌స్టార్ దేవ్(ఘటల్)తోపాటు గాయకులు సౌమిత్రీరాయ్, ఇంద్రనీల్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘జన సేన’ పార్టీని స్థాపించారు. తన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించడం తన ధ్యేయమని పవన్ ప్రకటించడం విశేషం.