నాగర్‌కర్నూల్‌లో రాహుల్‌గాంధీ యూత్ ఫార్ములా
మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: యువతను ప్రోత్సహించి రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫార్ములాను ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలుచేయనున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే జిల్లా వాసి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అంబేద్కర్ జైభీం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల శ్రీహరిని నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నట్లు తెలిసింది.
అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి మాజీ ఎంపీ మల్లురవి నిరాకరించడం, ఎంపీ టికెట్ ఆఫర్‌చేసినా టీడీపీని వదిలేది లేదని అచ్చంపేట ఎమ్మెల్యే రాములు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ స్థానానికి ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పర్యటనకు జీఓఎం సభ్యుడు, కేంద్రమంత్రి జైరాం రమేశ్ వచ్చిన సందర్భంగా కూడా నాగర్‌కర్నూల్‌లో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిత్వానికి సరైన నేత లేరని డీసీసీ వర్గాలు తేల్చిచెప్పాయి.
రాహుల్‌గాంధీ దూత, ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ద్వారా ఏఐసీసీ స్థాయిలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ముకురాలకు చెందిన శ్రీహరి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు దేశవ్యాప్తంగా పలు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఇందుకు ఉపకరించినట్లు ఆయనను నాగర్‌కర్నూలు నుంచి అభ్యర్థిగా బరిలోకి దించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మందా జగన్నాథం మాదిగ సామాజికవర్గం అయినందున, అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని రంగంలోకి దించడం వల్ల విజయావకాశాలు మరింత మెరుగుపడుతాయన్న ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థిగా శ్రీహరి?
Published Tue, Mar 25 2014 3:04 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
Advertisement