సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాయిదా పడ్డాయి. బుధవారం మున్సిపల్ ఎన్నికల లెక్కింపు నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు ఫలితాల విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న అంశం పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం హైకో ర్టు ఓట్ల లెక్కింపు 9వ తేదీకి వాయిదా వేసింది. గతంలో తాము ఆదేశించిన వి ధంగానే ఈనెల 10వ తేదీలోగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాల్సిందేనని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో అధికారులు బుధవారం నిర్వహించాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను 9వ తేదీన చేపట్టనున్నారు.
సర్వంసిద్ధం చేసిన యంత్రాంగం
ఎన్నికల నోటిఫికేషన్‌కు అనుగుణంగా సంగారెడ్డి మున్సిపల్ అధికారులు బుధవారం ఓట్ల లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించే అధికారులకు మున్సిపల్ సమావేశ మందిరంలో శిక్షణ సైతం ఇచ్చారు. కౌంటింగ్ నిర్వహించేందుకు మున్సిపల్ ఎన్నికల అధికారి సాయిలు ఆధ్వర్యంలో ఎనిమిది టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ రౌండ్‌కు 3వార్డుల చొప్పు న ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లతోపాటు కౌంటింగ్ అధికారులకు శిక్షణ సైతం ఇచ్చారు. అయితే మంగళవారం సాయంత్రం హైకోర్టు మున్సిపల్ ఫలితాలను ఈ నెల 9 వరకు వాయిదా వేయాలని తీర్పు ఇవ్వడంతో అధికారులు శిక్షణానంతరం వెనుతిరిగి వెళ్లారు.
అభ్యర్థుల్లో నిరాశ
బుధవారం నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫలితాల వెల్లడికి మరోవారం రోజుల గడువు ఉండడంతో విజయావకాశాలపై అనుచరులతో చర్చించుకుంటూ కనిపించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం, పోలింగ్ రోజున అనుచరులకు మర్యాదలు చేసి జేబులకు చిల్లుపెట్టుకున్న కొందరు అభ్యర్థులు, మరికొన్ని రోజుల పాటు తమ వెంట ఉన్నవారికి సకల మర్యాదలు చేయాల్సి రావడంతో ఇబ్బందిపడుతున్నారు.
మున్సిపల్ ఫలితం వాయిదా
Published Wed, Apr 2 2014 12:14 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement