పురసమరం ప్రశాంతం
భారీగా 74.29 శాతం పోలింగ్ నమోదు
ఎండను సైతం లెక్కచేయని మహిళలు, వృద్ధులు
ఉత్సాహంగా పాల్గొన్న యువతరం
సాక్షి, హైదరాబాద్: చెదురు మదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని 145 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గత రెండు ఎన్నికల కన్నా ఈసారి పురపాలక ఎన్నికల్లో భారీగా 74.29 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో పోలింగ్ శాతం 63.25గా నమోదైంది. పలు చోట్ల తమకు గుర్తింపు కార్డులు ఉన్నా ఓట్లు లేవని, ఓట్లు ఉన్నప్పటికీ స్లిప్‌లు లేవనే కారణంతో ఓట్లు వేయడానికి అనుమతించలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే పలు చోట్ల రాజకీయ పార్టీల స్థానిక కార్యకర్తలు, నాయకుల మధ్య చిన్న చిన్న ఘర్షణలు తలెత్తాయి. పోలింగ్‌లో పాల్గొనటానికి ఎండ త్రీవతను లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు సైతం బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు క్యూలో ఉన్నవారిని కూడా ఎంత సమయమైనా ఓటు వేసేందుకు అనుమతించారు. వరంగల్ జిల్లా జనగాం, పశ్చిమగోదావరి జిల్లా వీరభద్రాపురం, విజయనగరం జిల్లోలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు సాయంత్రం 6.30 గంటల వరకు ఓట్లు వేశారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత కూడా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు.
ఊహించిన దాని కన్నా అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా ఓటర్లు స్పందించారని, పోలింగ్ శాతాన్ని చూస్తే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే బలమైన ఆకాంక్ష ప్రజలు వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. ఆరు చోట్ల మంగళవారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని.. అనంతరం ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల)ను స్ట్రాంగ్ రూంలకు తరలించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ వి.ఎస్.కె.కౌముది తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలకే సగటున 66.42 శాతం పోలింగ్ నమోదైంది. 2000 సంవత్సరంలో జరిగిన మున్సిపాలిటీల ఎన్నికల్లో 63.41 శాతం పోలింగ్ జరగ్గా 2005లో జరిగిన ఎన్నికల్లో 69.12 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి గత రికార్డులను అధిగమించి భారీగా 73.16 శాతం వరకు పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాల్లో 82.45 శాతం పోలింగ్ నమోదైంది.
కొన్ని చోట్ల ఉదయం ఎలక్ట్రానిక్ యంత్రాలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
్హ గుంటూరు జిల్లా మాచర్లలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.లక్ష్మారెడ్డి పోలింగ్ కేంద్రంలో చొరబడి ఈవీఎంను పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఆ ఈవీఎంను సీల్ చేసి మరో ఈవీఎంతో పోలింగ్‌ను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా మడకసిరలో మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ వృద్ధులను తీసుకువస్తుండటంతో స్థానిక ఎస్‌ఐ దాడికి పాల్పడినట్లు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపాలని అదనపు ఎస్‌పీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
తాడిపత్రి, మదనపల్లిలో ఒకో చోట, నందిగామ, సూర్యాపేట రెండేసి చోట్ల మంగళవారం రీపోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తారు.
జిల్లాల వారీగా మున్సిపల్ పోలింగ్ శాతాలిలా...
జిల్లా పేరు పోలింగ్ శాతం
శ్రీకాకుళం 77.14
విజయనగరం 73.00
విశాఖపట్నం 78.97
తూర్పుగోదావరి 74.37
పశ్చిమగోదావరి 74.38
కృష్ణా 68.62
గుంటూరు 78.94
ప్రకాశం 82.45
నెల్లూరు 64.46
చిత్తూరు 72.53
అనంతపురం 71.49
కర్నూలు 66.98
కడప 68.93
వరంగల్ 77.79
కరీంనగర్ 75.29
ఖమ్మం 75.65
ఆదిలాబాద్ 66.41
రంగారెడ్డి 73.97
నల్లగొండ 75.43
మెదక్ 77.09
మహబూబ్‌నగర్ 75.05
నిజామాబాద్ 60.65
మొత్తం 74.29