చైర్మన్‌గిరీ ఎవరికో?
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఆమదాలవలస పురపాలక సంఘ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అధిక స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నా స్పష్టమైన ఆధిక్యత లేకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటుపై అందరి దృష్టి మళ్లింది. మున్సిపాల్టీ పరిధిలోని 23 స్థానాల్లో పది వైఎస్సార్‌సీపీ, ఎనిమిది టీడీపీ, మూడు కాంగ్రెస్, రెండిట్లో స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఫలితాలు వెలువడక ముందే వైఎస్సార్‌సీపీలో చేరారు. మరొకరు టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థినిగా బొడ్డేపల్లి అజంతాకుమారి, టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా తమ్మినేని గీతను ఎన్నికల ముందు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అధిక్యతతో బొడ్డేపల్లి కుటుంబీకులకే అధ్యక్ష పీఠం దక్కుతుందని అందరూ భావించారు.
కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఆమదాలవలస ఎమ్మెల్యేగా కూన రవికుమార్, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. వీరిద్దరూ టీడీపీకి చెందినవారు. దీంతో ఎక్స్ అఫీషియో ఓటుతో మున్సిపాల్టీ చైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీ కోల్పోవాల్సి వస్తుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మూడు స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వైఎస్సార్‌సీసీకి మద్దతు ప్రకటి స్తుందని కొందరు భావిస్తున్నారు. ఎనిమిది మంది కౌన్సిలర్లు, (టీడీపీలో చేరితే) ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో 11 ఓట్లు టీడీపీకి ఉంటాయి. ఇప్పటికే పది సీట్లతో పాటు ఇండిపెండెంట్ చేరికతో వైఎస్సార్‌సీపీ బలం 11కు చేరింది. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు కీలకమైంది. ఇప్పటి వరకు బొడ్డేపల్లి వారసులకే దక్కుతున్న మున్సిపల్ చైర్మన్ గిరీ వారికే దక్కుతుందని పలువురు బావిస్తున్నారు.