నేను చెప్పిన ట్టు వినండి.. లేదా..!
ఆమదాలవలస: నేను చెప్పే పనులు చేసే అధికారులే ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులుగా ఉండండి లేదంటే స్వచ్చందంగా బదీలీలు చేయించుకుని వెళ్లిపోండి. ఈ రెండూ చేయకపోతే నేనే మిమ్మల్ని పంపించివేసి నాకు నచ్చిన వారిని తెచ్చిపెట్టుకుంటా. ఈ మాటలేంటని అనుకుంటున్నారా. ఇది ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అధికారులతో మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్న మాటలు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ నూకేశ్వరరావు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో రవికుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించడంతోపాటు, మున్సిపల్ పరిధిలో ఉన్న బోగస్ కార్డులు, పింఛన్లు రద్దుచేసేందుకు తగిన కార్యచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయూలని కమిషనర్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, సీసీరోడ్లు, ఆదాయ వ్యయూలపై అధికారులను నిలదీస్తూ ఆరాతీశారు. మున్సిపల్ మేనేజర్ కె శ్రీనివాసరావు, తహశీల్దారు శ్రీరాములు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.