పోటెత్తిన ఓటు ఎవరికి స్వీచే టు! | Municipal elections Record level Polling | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ఓటు ఎవరికి స్వీచే టు!

Published Tue, Apr 1 2014 5:09 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Municipal elections Record level Polling

 పోటెత్తిన ఓటు ఎవరికి మిఠాయిలు తినిపించనుంది... ఎవరిని ముంచేయనుంది... ఏయే వర్గాల వారు ఏ పార్టీకి ఓటు వేశారు... ఓటింగ్ సరళి ఎవరికి అనుకూలం... ఇది మున్సిపల్ ఎన్నికలపై జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న చర్చల సారాంశం. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఓటర్లు అన్ని వర్గాల నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో 5 నుంచి 10 వరకూ పోలింగ్ శాతం పెరిగింది. ఈ పరిణామం ఎవరికి నష్టం చేకూరుస్తుందో తెలియక అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ దూకుడుతో ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ నేతలకు వణుకు పట్టుకుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ప్రభావం చూపడంతో ప్రత్యర్థి పార్టీ నేతల ఆశలు సన్నగిల్లాయి. దీనికి తోడు ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరగడం, సెలైంట్ ఓటింగ్ ఎక్కువగా జరగడంతో కాంగ్రెస్, టీడీపీ నేతల్లో భయం చోటు చేసుకుంది. తమకు ప్రతికూల సంకేతమన్న అభిప్రాయంతో అంతర్మథనం చెందుతున్నారు. బూత్‌ల వారీగా  పోలింగ్‌పై పోస్టుమార్టం చేసుకుంటున్నారు. ఎక్కడెన్ని ఓట్లు వస్తాయన్న దానిపై బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతికూల లెక్కలు వస్తుండడంతో అంచనాలు తలకిందులయ్యాయని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలీయమైన శక్తిగా ఎదిగింది.
 
 ప్రజల ఆదరాభిమానాలతో ముందుకు దూసుకుపోతోంది. విశ్వసనీయత గల రాజకీయాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. మహానేత వైఎస్సార్ జనరంజక పాలన, ఆయన తరహాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే చేయగలరన్న బలమైన నమ్మకంతో ప్రజలు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు జరగడం, ఇదే సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించడం, ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పార్టీలో మంచి ఊపు వచ్చింది. ఆయనిచ్చిన హామీలు, భరోసాతో పట్టణ ఓటర్లు మరింత ఆకర్షితులయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన పోలింగ్‌లో అత్యధిక మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సెలైంట్‌గా ఓటింగ్ జరిగిపోయింది. దీంతో గతం కన్న పోలింగ్ శాతం పెరిగింది. 2005లో జరిగిన ఎన్నికల్లో పార్వతీపురం మున్సిపాల్టీలో 69.75 శాతం ఓట్లు పోలవగా, ఈసారి 79.50 శాతం ఓట్లు పోలయ్యాయి.  సాలూరు మున్సిపాల్టీలో గత ఎన్నికల్లో 75.87శాతం ఓట్లు పోలవగా, ఈసారి 79.72 శాతం పోలింగ్ నమోదైంది. ఇక బొబ్బిలి మున్సిపాల్టీకొస్తే గత ఎన్నికల్లో 74.62 శాతం నమోదు కాగా, తాజా ఎన్నికల్లో అత్యధికంగా 80.14 శాతం ఓట్లు పోలయ్యాయి. విజయనగరం మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 66 శాతం పోలవగా, ఈసారి 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి.   పోలింగ్ తీరుతెన్నులు, ఓటు వేసేందుకు ఆసక్తి చూపిన వర్గాలను గమనిస్తే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూల ఫలితాలు వచ్చేటట్టు కనిపిస్తోంది. దీంతో తమ హవా చూపిస్తామని భావించిన టీడీపీలో అంతర్మథనం మొదలైంది. కాంగ్రెసైతే కొద్దోగొప్పో ఉన్న ఆశలు సైతం వదులుకోవాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. 
 
 లెక్కల్లో తలమునకలు
 లెక్కలు వేసుకోవడంలో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. బూత్‌ల వారీగా వచ్చే ఓట్లు విషయంలో అంచనాలు వేసుకుంటున్నారు. గెలుపోటములపై బేరీజు వేస్తున్నారు. సోమవారం దాదాపు ప్రతి అభ్యర్థి ఇంట నాయకుల సందడి కనిపించింది. ఫలానా వారి ఓట్లు రావొచ్చునని, ఈ మేరకు ఆ అభ్యర్థికి మెజార్టీ వస్తుందని విశ్లేషించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పతనావస్థకు చేరడం, ఇండిపెండెంట్లు కీలకంగా వ్యవహరించడంతో చీలిపోయిన ఓట్లతో నష్టమెవరికి జరుగుతుందోనన్న భయం అభ్యర్థులకు పట్టుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement