రెండింటిలో టీడీపీ గెలుపు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మున్సిప ల్ ఎన్నికల్లో టీడీపీ రెండు చోట్ల విజయం సాధించగా, వైఎస్సార్‌సీపీ ఒక చోట ఆధిక్యతను సాధించింది. మరో చోట ఏ పార్టీకీ పూర్తి స్థాయిలో ఆధిక్యత రాకపోవడంతో హంగ్ చోటు చేసుకుం ది. విజయనగరం, సాలూరు మున్సిపాల్టీల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేయ గా, బొబ్బిలిలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యతను సాధించింది. పార్వతీపురం మున్సిపాల్టీలో టీడీపీ స్వల్ప ఆధిక్యతలో నిలిచింది. విశేషమేమిటంటే పార్వతీపురంలో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఈ ఏడాది మార్చి 30న జరిగిన పోలింగ్‌లో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు సోమవారం బయటికొచ్చాయి. ఉదయం 11గంటలకే దాదాపు అన్ని ఫలితాలొచ్చేశాయి.
బొబ్బిలి మున్సిపాల్టీలోని 30 కౌన్సిలర్ స్థానాల్లో 15స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 13స్థానాలను సాధించగా, మిగతా రెండు స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. విజయనగరం మున్సిపాల్టీలోని 40 స్థానాలకు గాను అత్యధికంగా 32స్థానాలను టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్‌సీపీ రెండు చోట్ల, కాంగ్రెస్ ఐదు చోట్ల, ఇండిపెండెంట్ ఒక చోట గెలిచారు. ఇక, పార్వతీపురం మున్సిపాల్టీలోని 30 స్థానాల్లో టీడీపీ 14స్థానాలను గెలుచుకోగా, వైఎస్సార్‌సీపీ 10 స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా ఆరు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. గెలిచిన ఇండిపెండెంట్లలో దాదాపు అందరూ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారు. సాలూరు మున్సిపాల్టీలోని 29 స్థానాలకు గాను టీడీపీ 17స్థానాలను గెలుచుకోగా, వైఎస్సార్‌సీపీ తొమ్మిది చోట్ల విజయం సాధించింది. మరో 3చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
పార్టీల పరంగా పోలైన ఓట్లు
కాగా, పార్టీల పరంగా పోలైన ఓట్లు చూస్తే బొబ్బిలి మున్సిపాల్టీలో టీడీపీ కన్న వెఎస్సార్‌సీపీ 1,364ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 13,972ఓట్లు సాధించగా, టీడీపీకి12,608 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,262ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక, పార్వతీపురంలో వైఎస్సార్‌సీపీ కన్నా టీడీపీ 3,057ఓట్ల ఆధిక్యతను సాధించింది. పోలైన వాటిలో టీడీపీకి 10,346ఓట్లు, వైఎస్సార్‌సీపీకి 7,289ఓట్లు, ఇండిపెండెంట్లుకు 5,132ఓట్లు లభించాయి. ఇక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో కాంగ్రెస్ నాల్గో స్థానానికి పడిపోయింది. సాలూరులో వైఎస్సార్‌సీపీ కంటే కేవలం 2,385ఓట్లు మాత్రమే టీడీపీ అదనంగా సాధించిం ది. ఇక్కడ టీడీపీ 11,712 ఓట్లు సాధించగా, వైఎస్సార్‌సీపీ 9,326ఓట్లు, కాంగ్రెస్ 3,511ఓట్లు సాధించాయి. ఇక, విజయనగరంలో టీడీపీకి 54,369ఓట్లు, కాంగ్రెస్‌కు 33,308ఓట్లు, వైఎస్సార్‌సీపీకి 20,859ఓట్లు లభించాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు 14,212 ఓట్లు సాధించారు.
గట్టిపోటీ
బొబ్బిలి మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్ సీపీ ఆధిక్యతను సంపాదించగా, సాలూరులో టీడీపీకి గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ టీడీపీకి, వైఎస్‌ఆర్ సీపీ స్వల్ప ఓట్ల తేడా ఉంది. సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేకపోవడం, అనుకోకుండా వచ్చిన ఎన్నికలు, అన్నిచోట్లా ఎమ్మెలే అభ్యర్థుల ఎంపిక పూర్తిగా జరగకపోవడం వంటి అంశాలు ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్ సీపీ అధిక ఓట్లతో మెరుగైన స్థానంలో నిలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది. నాలుగు మున్సిపాలిటీల్లో ఐదు లోపే స్థానాలను దక్కించుకోగా, పార్వతీపురం మున్సిపాలిటీలో ఒక్కస్థానం కూడా రాకపోవడం ఆ పార్టీ నేతలను తీవ్ర నిరాశనిస్ఫృహల్లో ఉన్నారు.
మున్సిపాలిటీల వారీగా ఫలితాల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు వైఎస్సార్ సీపీ టీడీపీ కాంగ్రెస్ ఇతరులు
బొబ్బిలి 30 15 13 02 --
పార్వతీపురం 30 10 14 -- 06
సాలూరు 29 09 17 03 ---
విజయనగరం 40 02 32 5 1