సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో అతిచిన్న నియోజకవర్గమైన చాందినీచౌక్‌లో రాజకీయ దిగ్గజాల మధ్య పోటీ జరుగనుంది. కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ కపిల్ సిబల్ కాంగ్రెస్ అభ్యర్థిగా, ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున మాజీ టీవీ జర్నలిస్టు ఆశుతోష్ , బీజేపీ అభ్యర్థిగా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ పోటీచేస్తున్నారు.
హేమాహేమీలు తలపడుతోన్న ముక్కోణపు పోరులో విజేతను నిర్ధారించడంలో ముస్లిం ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ఇటీవ లి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ రెండింటిని, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగింటిని, బీజేపీ మూడింటిని గెలుచుకున్నాయి.
జేడీయూకు చెందిన షోయబ్ ఇక్బాల్ ఒక సీటును గెలుచుకున్నారు. కాంగ్రెస్ గెలిచిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు-చాందినీ చౌక్, బల్లీమారన్‌లతో పాటు మటియా మహల్ అసెంబ్లీ స్థానాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పరిస్థితిలో తేడా ఉండడం వల్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశముంది.
కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ మూడవసారి ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో విజయలక్ష్మి కపిల్ సిబల్‌ను సులువుగా వరించింది. కానీ అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లో గెలవడం సిబల్‌కు అంత సులభం కాదు. కేంద్రంలో యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా వీస్తోన్న పవనాలు సిబల్ గెలుపుపై కూడా ప్రభావం చూపనున్నాయి. ి
సబల్ వంటి అగ్రనేత తమకు చేయవలసినంత మేలు చేయలేదని ముస్లింలు అసంతృప్తితో ఉన్నారు. ఆయనస్థానికులకు అందుబాటులో ఉండరన్న అభిప్రాయం చాలామంది ఓటర్లకు ఉంది. నరేంద్ర మోడీని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని, ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీయే తగినదని కొందరు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి తమకు విజయం తథ్యమన్న ఉద్దేశంతో ఆశుతోష్‌ను బరిలోకి దింపింది. అయితే పార్టీలో కొత్తగా చేరిన బయటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఆప్ కార్యకర్తలకే మింగుడు పడలేదు. ఆశుతోష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. అయితే ఆప్‌కున్న జనాదరణతో పాటు నరేంద్ర మోడీ వ్యతిరేక ముస్లిం ఓట్లు ఆప్‌కు అనుకూలించవచ్చని అంటున్నారు.
ఆశుతోష్ కావడం కూడా కలిసివచ్చే అవకాశముంది. అయితే 49 రోజుల్లోనే అధికారం వదిలి పారిపోయిందన్న మచ్చ ఆప్‌ను వేధిస్తోంది. ఢిల్లీ బీజేపీ నేతలందరికల్లా ఎక్కువ ప్రజాదరణ కలిగిన నేతగా ముద్రపడిన డాక్టర్ హర్షవర్ధన్‌ను చాందినీచౌక్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టి ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఆ పార్టీ చిత్తు చేసిందనే చెప్పాలి.
కానీ అంతటి బలమైన అభ్యర్థికి సైతం చాందినీచౌక్‌లో విజయం సాధించడం అంతసులువుగా లేదు. చాందినీచౌక్‌లోనే తాను 15 ఏళ్లు పెరిగానని హర్షవర్ధన్ చెప్పుకుంటునప్పటికీ ముస్లిం ఓటర్లు ఆయనను అక్కున చేర్చుకోవడానికి వెనుకాడుతున్నారు. ముఖ్యంగా నరేంద్రమోడీ భయం వారిని వేధిస్తోంది. ముస్లిం ఓటర్ల వ్యతిరేకత హర్షవర్ధన్‌కు మైనస్ పాయింట్ కాగా బీజేపీకి అనుకూలంగా ఉన్న లోక్‌సభ ఎన్నికల వాతావరణం, విశ్వసనీయుడైన నేతగా హర్షవర్ధన్‌కున్న పేరు, వైశ్యుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్లని అంటున్నారు.
చరిత్ర: ఢిల్లీ సిటీ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రెండుగా విభిజించడంతో 1957లో నియోజకవర్గంగా ఆవిర్భవించిన చాందినీచౌక్ 2004 వరకు దేశంలోనే అతి చిన్న లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండేవి. అయితే ఇప్పుడీ నియోజకవర్గం పరిధి పాత ఢిల్లీని దాటిపోయింది.
పలు పునరావాస కాలనీలు, మురికివాడలు ఇప్పుడీ నియోజకవర్గం పరిధిలోకి చేరాయి. ఈ నియోజకవర్గంలోని వైశ్యులు, పంజాబీలు సంప్రదాయకంగా బీజేపీ ఓటర్లుగా ఉండేవా రు. కానీ కాలక్రమేణా వారు పొరుగున ఉన్న ఘజియాబాద్, నోయిడా, షహిబాబాద్ గుర్గావ్, ఫరీదాబాద్‌లకు వలస వెళ్లడంతో బీజేపీ పరిస్థితి ఇరుకునపడింది.
ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. పాత ఢిల్లీ వెలుపలి ప్రాంతాల్లో ఓబీసీ, దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని 14 లక్షల ఓటర్లలో 35 శాతం మంది వైశ్య ఓటర్లు కాగా, 12 శాతం మంది పంజాబీ ఓటర్లున్నారు. ముస్లిం ఓటర్లు 21 శాతమున్నారు. షెడ్యూల్డు కుల ఓటర్లు 26 శాతముండగా, 9 శాతం బ్రాహ్మణ ఓటర్లున్నారు.