మాజీ సీఎం కనబడుట లేదు!
శీర్షిక చదివి చకితులవకండి. ఇది నికార్సైన నిజం. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నల్లారి వారు నలుసైపోయారు. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి నాలుగు రోజులైనా ఆయన దర్శనం లేదు. కనీసం మాట కూడా వినిపించలేదు. సమైక్య చాంపియన్ నేనేనంటూ భుజాలెగరేసి తన పార్టీని బరిలోకి దింపి భంగపడ్డారు కిరణయ్య. 'జై సమైక్యాంధ్ర'తో ప్రజలు జేజే అందుకోవాలన్న ఆయనగారి ఆశలు ఫలించకపోవడంతో ముఖం చాటేశారా?
సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 150పైగా స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట కూడా ఆ పార్టీ విజయం గెలవలేదు. సొంత నియోజకవర్గం పీలేరు సీటైనా వస్తుందనుకున్న కిరణ్కు చేదుఅనుభవమే ఎదురైంది. అత్యధిక స్థానాల్లో జై సమైక్యాంధ్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూశారు.
ఎన్నికల ఫలితాలు విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. పార్టీ ఓటమిపైన కానీ, పోలింగ్ సరళిపైన కానీ తన స్పందన వెల్లడించలేదు. అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులు ఎన్నికల ఫలితాలపై తమ స్పందన తెలిపారు. చివరి బంతి వరకు వేచిచూసే అలవాటున్న కిరణ్ ఈ విషయంలోనే అదే పంథా అనుసరిస్తున్నట్టు కనబడుతోంది. కిరణ్ ప్రత్యర్థులు మాత్రం మాజీ సీఎం కనబడుట లేదు అంటూ జోకులు పేలుస్తున్నారు. ఇప్పటికైనా పలుకైనా కిరణ్ పలుకుతారో, లేదో?