బీజేపీలో ఉత్సాహం నింపిన మోడీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో దళిత, ముస్లిం జనాభా ఎక్కువగా నివసించే ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల కోసం నగరంలో బుధవారం రాత్రి మోడీ నిర్వహించిన తొలి బహిరంగ సభ బీజేపీలో ఉత్సాహం నింపింది. దీని ద్వారా ముస్లిం ఓటర్లను కూడా ఆకట్టుకున్నామని బీజేపీ నేతలు భావిస్తున్నారు.ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, చాంది నీచౌక్ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లు తమ పార్టీకి తప్పకుండా ఓటేస్తారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.
ర్యాలీలో మోడీ జపం
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీతో బుధవారం శాస్త్రిపార్క్ ‘హర్‌హర్ మోడీ’ నినాదాలతో మార్మోగింది. ఈ నినాదంపై వివాదం కొనసాగుతున్నప్పటికీ కార్యకర్తలు, పశ్చిమ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ కూడా పలుసార్లు వేదికపై ఈ నినాదం చేశారు. హర్‌హర్ మోడీ నినాదం చేయవద్దని మోడీ స్వయంగా కోరినా ఫలితం లేకపోయింది. ర్యాలీ కోసం బారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న మీనాక్షీ లేఖీ మినహా మిగతా ఆరు స్థానాల నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు హాజరయ్యారు. నరేంద్ర మోడీ ప్రసంగానికి ముందు వీరంతా మాట్లాడారు. అయితే ఈ అభ్యర్థులు ప్రసంగిస్తుండగా ప్రేక్షకుల్లో కనిపించని ఉత్సాహం మోడీ ప్రసంగిస్తుండగా కనిపించింది. మోడీకి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చే శారు.
కాంగ్రెస్, ఆప్‌పై విమర్శనాస్త్రాలు
నరేంద్ర మోడీ తన ప్రసంగంలో రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు కురిపించారు. ఆప్‌కు ఓటు వేసి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయరాదని ఆయన కోరారు. ఆప్‌ను కాంగ్రెస్‌కు ‘బీ’ టీంగా అభివర్ణించారు. ‘కాంగ్రెస్ అనేక ముసుగులు వేసుకుంటుంది. వీటిని గుర్తించాలి. ప్రతిపక్షంలో అనేక ఏళ్లు గడిపిన మాకు ఈ విషయం బాగా తెలుసు.
ట్రాన్స్ యమునా ప్రాంతంలో సదుపాయాలు ఏవీ లేవు. ఇక్కడ మనుషులు ఎలా నివసిస్తున్నారో అర్థం కావడం లేదు. దేశరాజధానిలో మహిళలకు భద్రత లేదని డిసెంబర్ 16 సామూహితక అత్యాచార ఘటన నిరూపిస్తోంది. కాంగ్రెస్ కేవలం మైనారిటీ రాజకీయాలు చేస్తుంది. ముస్లింలకు కాంగ్రెస్ వల్ల కలిగిన లాభం ఏమీ లేదు’ అని మోడీ అన్నారు.