వీరికి ఆస్తులే లేవట!
ఒకవైపు కళ్లు చెదిరేలా కోట్లాది రూపాయల ఆస్తులను కొందరు అభ్యర్థులు ప్రకటిస్తుండగా.. అందుకు విరుద్ధంగా తమకు ఆస్తులేం లేవంటూ మరికొందరు చెబుతున్నారు. తమిళనాడు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న 14 మంది అభ్యర్థులు తమ పేరుపై ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని ఎన్నికల సంఘానికిచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వారిలో 12 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కాగా, సీపీఐఎంఎల్ రెడ్‌స్టార్, అఖిల భారత హిందూ మహాసభ పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి ఉన్నారు. మరోవైపు రూ.5 కోట్లకు పైగా అప్పులున్న అభ్యర్థుల సంఖ్య కూడా పద్నాలుగే. వారిలో కాంగ్రెస్ తరఫున కన్యాకుమారిలో పోటీ చేస్తున్న హెచ్ వసంతకుమార్ రూ.87 కోట్ల రుణంతో మొదటిస్థానంలో ఉన్నారు. విశేషమేంటంటే అత్యధిక ఆస్తులున్న అభ్యర్థుల్లోనూ రూ.285 కోట్లతో ఆయనే ప్రథమ స్థానంలో ఉన్నారు. శివగంగ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం ఆదాయం సంవత్సరానికి రూ. 1 కోటి.